July 19, 2026

National Film Awards 2026: ’35 – చిన్న కథ కాదు’కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!

National Film Awards 2026: '35 - చిన్న కథ కాదు'కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!
Reading Time: 2 minutes

National Film Awards 2026: ’35 – చిన్న కథ కాదు’కు డబుల్ ధమాకా.. రెండు జాతీయ అవార్డులు కైవసం!

Caption of Image.

భారీ బడ్జెట్‌లు, స్టార్ హీరోలు, గ్రాండ్ విజువల్స్ లేకుండానే ఒక చిన్న సినిమా దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది.. అదే ’35 – చిన్న కథ కాదు’. ఇప్పుడు ఈ చిత్రానికి  దేశస్థాయిలో అత్యున్నత గుర్తింపు లభించింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఈ సినిమా ఏకంగా ఉత్తమ బాలల చిత్రం (Best Children’s Film) అవార్డును కైవసం చేసుకుంది. అంతే కాదు ఈ చిత్రంలో తన సహజ నటనతో ఆకట్టుకున్న పోతుల అరుణ్ దేవ్ ఉత్తమ బాలనటుడు (Best Child Artist) పురస్కారాన్ని అందుకుని తెలుగు సినిమాకు డబుల్ గౌరవాన్ని తీసుకొచ్చాడు.

పిల్లల జీవితాల్లో మార్కుల ఒత్తిడి, చదువు పేరుతో పెరుగుతున్న మానసిక భారం, తల్లిదండ్రుల ఆశలు, కుటుంబ అనుబంధాలు వంటి ప్రతి ఇంటికి సంబంధించిన అంశాలను హృదయానికి హత్తుకునేలా ఈ సినిమా ఆవిష్కరించింది. అందుకే ఇది కేవలం ఒక సినిమా కాదు.. ప్రతి కుటుంబం తప్పకుండా చూడాల్సిన జీవిత పాఠంలా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది.

దర్శకుడు నందకిషోర్ ఈమాని ఎలాంటి వాణిజ్య హంగులపై ఆధారపడకుండా, బలమైన కథతోనే ప్రేక్షకులను కట్టిపడేశారు. ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి పులికొండ, విశ్వదేవ్ రాచకొండ అద్భుత నటన కనబరిచారు. ముఖ్యంగా చిన్నారుల భావోద్వేగ ప్రదర్శన సినిమాకు అతిపెద్ద బలంగా నిలిచింది.

థియేటర్లలో విడుదలైన తర్వాత మౌత్ పబ్లిసిటీతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఓటీటీలో విడుదలయ్యాక మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ సినిమాను విశేషంగా ఆదరించారు. విద్య అంటే కేవలం మార్కులు కాదని, పిల్లల మనసును అర్థం చేసుకోవడమే నిజమైన విజయం అనే సందేశాన్ని ఈ చిత్రం బలంగా వినిపించింది.

ALSO READ : జాతీయ ఉత్తమ చిత్రంగా ‘ఆర్టికల్ 370’ .. 

ఇప్పుడు రెండు జాతీయ అవార్డులతో ’35- చిన్న కథ కాదు’ మరోసారి తెలుగు సినిమా సత్తాను దేశానికి చాటింది. చిన్న సినిమాల్లోనూ గొప్ప కథలు పుడతాయని, నిజాయితీగా చెప్పిన కథకు ప్రేక్షకులతో పాటు జాతీయ స్థాయిలోనూ అత్యున్నత గౌరవం దక్కుతుందని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులు, అభిమానులు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ‘ఇది తెలుగు సినిమాకు గర్వకారణం’ అంటూ అభినందనలు తెలుపుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.