July 21, 2026

CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే

CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
Reading Time: < 1 minute
Sharad Pawar Supriya Sule Join Cjp Protest Jantar Mantar Delhi

దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. జంతర్‌మంతర్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమకారులు తమ నిరసన తెలుపుతున్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక సీజేపీ నిరసనకు ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలుపుతున్నారు. తాజాగా జంతర్‌మంతర్‌లో సీజేపీ నిరసనకారులను శరద్ పవార్, సుప్రియా సూలే కలిసి మద్దతు తెలిపారు. రేపు ఉద్ధవ్ ఠాక్రే జంతర్ మంతర్‌ను సందర్శించనున్నారు. సీజేపీ నిరసనకు మద్దతు తెల్పనున్నారు.

సోమవారం సీజేపీ తలపెట్టిన చలో సంసద్ కార్యక్రమం హింసాత్మకంగా మారింది. పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు. మంగళవారం ప్రతిపక్ష నాయకులతో పాటు కేంద్రమంత్రులు పరామర్శించారు. అయితే ఒక యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే మంగళవారం ప్రధాని మోడీ నివాసం ఎదుట కాంగ్రెస్ మెరుపు ధర్నా చేపట్టింది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు రాహుల్ గాంధీతో కేంద్రం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు డిమాండ్లు ముందు ఉంచారు. హెచ్‌ఆర్‌డీ మంత్రి రాజీనామా, సభలో హోం మంత్రి ప్రకటన, సభలో చర్చ, విద్యార్థుల సమస్యలను వినాలి, నిన్నటి హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే సోమవారం ఢిల్లీలో సీజేపీ చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారడానికి భారీ కుట్ర జరిగినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సోమవారం ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు పూర్తిగా నిలిచిపోయినా పెద్ద ఎత్తున నిరసనకారులు ఎలా రాగలిగారు అన్న దానిపై ఆరా తీస్తున్నారు. కొంతమంది ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని సందేశాలు పంపించుకున్నారు. ఒక సందేశంలో ‘‘రేపే మోడీ ప్రభుత్వానికి చివరి రోజు’’ అని ఉంది. మరోవైపు కొందరు నిరసనకారులు ఉద్యమం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అన్ని ఆధారాలను పరిశీలించాక చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.