Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!

Horror Movie: భారీ బడ్జెట్ కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లు, స్టార్ హీరోలతో వరుస విజయాలు… ఇప్పటివరకు మైత్రి మూవీ మేకర్స్ ప్రయాణం ఇదే. అయితే ఇప్పుడు ఆ నిర్మాణ సంస్థ పూర్తిగా కొత్త దారిలో అడుగుపెడుతోంది. ఎన్నో విజయవంతమైన యాక్షన్, ఎంటర్‌టైనర్ చిత్రాలను అందించిన మైత్రి మూవీ మేకర్స్ తొలిసారిగా హారర్ జానర్‌లోకి ప్రవేశిస్తోంది. ఆ ప్రయత్నమే ‘418’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, షూటింగ్ కంప్లీట్ గ్లింప్స్ ఆసక్తిని పెంచగా, తాజాగా చిత్ర బృందం విడుదల తేదీని ఆఫీషియల్ గా ప్రకటించింది. దీంతో ఈ సినిమాపై హారర్ అభిమానుల కన్ను పడింది. ‘418’ హారర్ మూవీ 2026 జూలై 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పబ్లిసిటీ స్టంట్స్ లో యూనిట్ బిజీగా ఉంది. వరుసగా టీజర్, ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌కు ఇది తొలి హారర్ చిత్రం కావడం కూడా సినిమాకి హైప్ క్రియేట్ అవుతోంది.
ఇక ఈ మూవీలో ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన ప్రీతి పగడాల ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ‘పతంగ్’ చిత్రంతో ఆమె ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆమెతో పాటు చరణ్ లక్కరాజు, సూర్య రాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పూర్తిగా కొత్త తారాగణంతో రూపొందుతున్న ఈ సినిమా థ్రిల్లర్ అంశాల చుట్టూనే ఉండబోతున్నట్లు చిత్రబృందం చెబుతోంది. ‘418’ చిత్రానికి కీర్తన్ నాడగౌడ కథ అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకు ఇది దర్శకుడిగా తొలి చిత్రం. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ప్రశాంత్ నీల్ మద్దతు ఇవ్వడం విశేషం. తన సహాయక దర్శకులు, కొత్త ప్రతిభను పరిశ్రమకు పరిచయం చేయడంలో ప్రశాంత్ నీల్ ఎప్పటినుంచో ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. అదే క్రమంలో కీర్తన్ నాడగౌడ ప్రతిభను నమ్మి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ కూడా కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో మరోసారి తమ నమ్మకాన్ని చాటుతోంది.
సాంకేతిక విభాగంలో కూడా ఈ చిత్రానికి బలమైన బృందమే పనిచేస్తోంది. దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వెంకీ జీజీ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. హారర్ సినిమాల్లో నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే ఈ రెండు అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంటోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్, గ్లింప్స్‌లలో కనిపించిన డార్క్ విజువల్స్ ప్రేక్షకుల్లో భయం పుట్టించేలా ఉన్నాయి. థియేటర్లలో ఎక్స్పీరియన్స్ మరోలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హారర్ జానర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. కంటెంట్ ఉన్న హారర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ జానర్‌లోకి అడుగుపెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ నీల్ మద్దతు, కొత్త దర్శకుడి ప్రయత్నం, భిన్నమైన కథతో వస్తున్న ‘418’ జూలై 31న ప్రేక్షకులను ఎంతగా భయపెడుతుందో చూడాలి.