July 21, 2026

మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన లాభాలు రావట్లేదా..? ఈ తప్పు చేస్తున్నారేమో చూస్కోండి

మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన లాభాలు రావట్లేదా..? ఈ తప్పు చేస్తున్నారేమో చూస్కోండి
Reading Time: 2 minutes

మ్యూచువల్ ఫండ్స్‌లో ఆశించిన లాభాలు రావట్లేదా..? ఈ తప్పు చేస్తున్నారేమో చూస్కోండి

Caption of Image.

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే చాలామంది ఒకే ఆలోచనతో ముందుకు సాగుతారు. ఎక్కువ స్కీమ్స్ ఉంటే రిస్క్ తగ్గుతుందని అనుకుంటుంటారు. ఒక లార్జ్ క్యాప్ ఫండ్, ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ట్యాక్స్ సేవింగ్ ELSS, మల్టీ క్యాప్, ఫోకస్డ్ ఫండ్ ఇలా ఐదారు స్కీమ్స్ తీసుకుంటే తమ పెట్టుబడి పూర్తిగా సేఫ్ అని అనుకుంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. వేర్వేరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నా, వాటి లోపల పెట్టుబడి పెట్టబడిన కంపెనీలు ఒకటే అయితే అది నిజమైన డైవర్సిఫికేషన్ కాదు.

చాలా మంది ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలను పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయటపడుతుంది. వేర్వేరు ఫండ్ హౌస్‌లు, వేర్వేరు పేర్లతో ఉన్న స్కీమ్స్‌లో కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, ఇన్ఫోసిస్, లార్సెన్ అండ్ టూబ్రో, భారతి ఎయిర్‌టెల్ వంటి పెద్ద కంపెనీలు పదేపదే కనిపిస్తుంటాయి. దీంతో బయటకు చూస్తే 5 ఫండ్స్ ఉన్నట్లు కనిపించినా.. వాస్తవానికి పెట్టుబడి కొన్ని అదే కంపెనీల పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది. దీనినే మ్యూచువల్ ఫండ్ ఓవర్‌ల్యాప్ లేదా డైవర్సిఫికేషన్ ఇల్యూజన్ అంటారు.

ఎందుకు అన్ని ఫండ్స్ ఒకే స్టాక్స్ కొంటాయి?
దీనికి ప్రధాన కారణం భారత స్టాక్ మార్కెట్‌లో కొన్ని పెద్ద కంపెనీల ఆధిపత్యం. మార్కెట్ క్యాపిటలైజేషన్, లిక్విడిటీ, స్థిరమైన ఆదాయాలు ఉన్న సంస్థలు ఫండ్ మేనేజర్లకు సహజంగానే ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అందుకే వేర్వేరు ఫండ్ మేనేజర్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా, చివరకు మంచి కంపెనీల ఎంపికలో వారి ఆలోచనలు ఒకే దిశలో కలిసే అవకాశం ఉంటుంది. ఇది ఫండ్ మేనేజ్‌మెంట్ లోపం కాదు. కానీ ఇన్వెస్టర్ ఒకే పెట్టుబడి ఆలోచనను పలుమార్లు కొనుగోలు చేస్తున్నాడా అనేది ముఖ్యమైన విషయం.

ఫండ్స్ సంఖ్య కాదు.. పెట్టుబడి ఆలోచనలే ముఖ్యం
5 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయని చెప్పడం కంటే.. అవి ఎలాంటి రాబడి అవకాశాలను అందిస్తున్నాయనేది ముఖ్యం. ఒక క్రికెట్ జట్టులో బ్యాట్స్‌మెన్ మాత్రమే ఉంటే సరిపోదు. బౌలర్లు, ఆల్‌రౌండర్లు కూడా అవసరం. అలాగే పోర్ట్‌ఫోలియోలో కూడా వేర్వేరు రకాల పెట్టుబడులు ఉండాలి. ఒక లార్జ్ క్యాప్ లేదా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌ను ప్రధాన పెట్టుబడిగా ఉంచుకుని, మిడ్ క్యాప్ ఫండ్ ద్వారా గ్రోత్ ఆపర్చునిటీస్, గ్లోబల్ ఫండ్ ద్వారా విదేశీ మార్కెట్ల ఎక్స్‌పోజర్, డెట్ లేదా హైబ్రిడ్ ఫండ్స్ ద్వారా స్థిరత్వం పొందవచ్చు.

స్టాక్ ఓవర్‌ల్యాప్ మాత్రమే కాదు.. స్టైల్ ఓవర్‌ల్యాప్ కూడా..
ఒకే స్టాక్స్ ఉండటమే కాకుండా.. రెండు ఫండ్స్ ఒకే విధమైన పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తే కూడా రిస్క్ పెరుగుతుంది. ఉదాహరణకు రెండు ఫండ్స్ వేర్వేరు కంపెనీల్లో పెట్టుబడి పెట్టినా, రెండూ పెద్ద కంపెనీలు లేదా ఒకే రంగాలపై ఆధారపడితే మార్కెట్ మార్పులకు ఒకే విధంగా స్పందించే అవకాశం ఉంటుంది.

స్మార్ట్ ఇన్వెస్టర్ చేయాల్సిన పని ఇదే..
మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను కేవలం ఫండ్స్ సంఖ్యతో కాకుండా, ప్రతి ఫండ్ అందించే ప్రత్యేక ప్రయోజనంతో అంచనా వేయాలి. కాలానుగుణంగా పోర్ట్‌ఫోలియోలో ఓవర్‌ల్యాప్ ఉందా, ఒకే రంగంపై ఎక్కువ ఆధారపడి ఉన్నామా అనే విషయాలను పరిశీలించాలి. ఎక్కువ ఫండ్స్ కలిగి ఉండటం వల్ల ఎప్పుడూ ఎక్కువ సేఫ్టీ రాదు. నిజమైన డైవర్సిఫికేషన్ అంటే వేర్వేరు ఆలోచనలు, రంగాలు, పెట్టుబడి విధానాల కలయిక. మార్కెట్ అనూహ్యంగా మారినప్పుడు మీ పెట్టుబడిని కాపాడేది మీకు ఎన్ని ఫండ్స్ ఉన్నాయన్నది కాదు.. వాటి మధ్య ఉన్న వైవిధ్యమే.
 

©️ VIL Media Pvt Ltd.