July 21, 2026

Jana Nayagan: విజయ్ సీఎం అవుతారని ఊహించలేదు.. ‘జన నాయగన్’పై వినోద్ కీలక వ్యాఖ్యలు

Jana Nayagan: విజయ్ సీఎం అవుతారని ఊహించలేదు.. ‘జన నాయగన్’పై వినోద్ కీలక వ్యాఖ్యలు
Reading Time: 2 minutes

Jana Nayagan: విజయ్ సీఎం అవుతారని ఊహించలేదు.. ‘జన నాయగన్’పై వినోద్ కీలక వ్యాఖ్యలు

Caption of Image.

సీఎం విజయ్ నటించిన ‘జన నాయగన్’ (Jana Nayagan) మరో రెండ్రోజుల్లో (జూలై 23న) థియేటర్లలో రచ్చ లేపడానికి వస్తుంది. ఇప్పటికే తమిళనాడుతో పాటు ఓవర్సీస్, పలు సిటీల్లో బుకింగ్స్ మొదలై దుమ్మురేపుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ సాయంత్రం లోపు బుకింగ్స్ షురూ అవ్వనున్నాయి. ఈ నేపథ్యంలోనే ‘జన నాయగన్’ డైరెక్టర్ హెచ్. వినోద్ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. సినిమా కథ, టైటిల్ ఎంపిక, భగవంత్ కేసరి రీమేక్, విజయ్‌తో పనిచేసిన అనుభవాలు వంటి పలు విషయాలపై మాట్లాడి హైప్ పెంచేశారు. ప్రస్తుతం డైరెక్టర్ వినోద్ చేసిన కామెంట్స్‌ సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి. 

విజయ్ చివరి సినిమా కాదు.. సీఎం విజయ్ తొలి చిత్రం..

ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ హెచ్. వినోద్ (H. Vinoth) మాట్లాడుతూ.. ‘జన నాయగన్’ను విజయ్ చివరి చిత్రంగా చూడకండి. ప్రస్తుతం పదవిలో ఉన్న ముఖ్యమంత్రి విజయ్ గారి తొలి సినిమాగా చూడండి” అని ఇంట్రెస్టింగా మొదలుపెట్టారు వినోద్. ముఖ్యంగా ఈ సినిమా కేవలం విజయ్ ఇమేజ్‌ను ఎలివేట్ చేసే కమర్షియల్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే శక్తులకు, దానిని కాపాడేందుకు పోరాడే వ్యక్తుల మధ్య జరిగే సంఘర్షణను ప్రతిబింబిస్తుందని తెలిపారు. సినిమా చూసిన తర్వాత ఇందులోని రాజకీయ అంశాలపై ప్రేక్షకులు తప్పకుండా చర్చించుకుంటారని వినోద్ విశ్వాసం వ్యక్తం చేశారు.

‘జన నాయగన్’ టైటిల్ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

ఈ సినిమా టైటిల్ ఎంపిక వెనుక ఉన్న ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు డైరెక్టర్ హెచ్. వినోద్. మొదటగా హీరో దళపతి విజయ్ నటుడిగా పరిచయమైన తొలి చిత్రం ‘నాళైయ తీర్పు’ (రేపటి తీర్పు). అలా విజయ్ సినీ కెరీర్ ఏ టైటిల్‌తో అయితే ప్రారంభమైందో, అదే పేరుతో ఈ చివరి చిత్రాన్ని కూడా ముడిపెట్టి, ఒక రౌండ్ సర్కిల్‌లా ముగించాలని వినోద్ భావించినట్లు చెప్పుకొచ్చారు. అయితే, కథలోని బలమైన రాజకీయ అంశాలు మరియు ప్రజాస్వామ్య పోరాటాన్ని దృష్టిలో ఉంచుకుని పరిశీలించగా, ‘జన నాయగన్’ (ప్రజా నాయకుడు) అనే పేరు కథ నేపథ్యాన్నికి మరింత న్యాయం చేకూరుస్తుందని భావించి చివరికి ఈ టైటిల్ నే ఫిక్స్ చేసినట్లుగా వినోద్ వెల్లడించారు. 

‘భగవంత్ కేసరి’ రీమేక్ వెనుక అసలైన ట్విస్ట్!

డైరెక్టర్ వినోద్ మొదట విజయ్‌కి ఒక ఫ్రెష్ లైన్ వినిపించారట. ఫస్టాఫ్ విని విజయ్ ఫుల్ ఫిదా అయిపోయినా, సెకండాఫ్ వచ్చేసరికి “ఏంటో భయ్యా.. కాస్త ఎక్కువ భారంగా (Heavy) అనిపిస్తోంది!” అని క్లియర్‌గా చెప్పేశారట. విజయ్ ఇచ్చిన ‘మాస్’ ఐడియా: అదే టైమ్‌లో విజయే స్వయంగా.. ‘తెలుగులో బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చూశావా? సూపర్ ఉంది.. నువ్వు కూడా ఒకసారి చూడు. నీకు నచ్చితే దాన్ని మన నేటివిటీకి తగ్గట్టు ట్రై చేద్దాం’ అని సలహా ఇచ్చారట. కానీ అప్పటికే అజిత్‌తో ‘పింక్’ రీమేక్ (నేర్కొండ పార్వై) చేసిన వినోద్ కి మళ్ళీ రీమేక్ అనగానే కాస్త భయం వేసినట్లుగా చెప్పుకొచ్చారు. పైగా అక్కడ ఉన్నది బాలయ్య మార్క్ మాస్ కాబట్టి దాన్ని తమిళ ఆడియన్స్‌కి, విజయ్ బాడీ లాంగ్వేజ్‌కి సెట్ చేయడం మామూలు రిస్క్ కాదని చెప్పుకొచ్చారు. 

లాస్ట్ ఛాన్స్.. మిస్ చేసుకుంటారా ఏంటి?

విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు వస్తున్న ఈ రేర్ ఆఫర్‌ను వదులుకోవడం వినోద్ కి అసలు ఇష్టం లేదు. ఈ క్రమంలోనే  రంగంలోకి దిగి బాలయ్య ‘మాస్ వరల్డ్’ని, విజయ్ ‘స్టైలిష్ యాక్షన్’కి పర్ఫెక్ట్‌గా సింక్ అయ్యేలా స్క్రిప్ట్‌ను సరికొత్తగా రీ-డిజైన్ చేసినట్లుగా వినోద్ తెలిపారు.

‘జన నాయగన్’ లీక్.. థియేట్రికల్ కలెక్షన్లపై ప్రభావం! 

‘జన నాయగన్’ లీక్ కావడం థియేట్రికల్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని హెచ్. వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది లీకైన కాపీలు చూసినట్లు విన్నానని, అయినప్పటికీ విజయ్ అభిమానులు థియేటర్లలో సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందన్నారు.

అలాగే, ఈ చిత్రం కేవలం కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదని, సమాజానికి అవసరమైన బలమైన సందేశంతో పాటు పలు సున్నితమైన రాజకీయ అంశాలను ప్రస్తావిస్తుందని చెప్పారు. విజయ్ టీవీకే (TVK) పార్టీని ప్రమోట్ చేయడానికే ఈ సినిమా తీశారన్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు.

‘సీఎం’ అవుతారని ఊహించలేదు..

షూటింగ్ ప్రారంభమైన సమయంలో విజయ్ ముఖ్యమంత్రి అవుతారని తాము ఊహించలేదని వినోద్ తెలిపారు. ఎన్నికలకు ముందే స్క్రిప్ట్‌ను పూర్తిగా సిద్ధం చేశామని, తర్వాత రాజకీయ పరిస్థితులు మారినా సినిమా అసలు కథలో ఎలాంటి మార్పులు చేయలేదని వెల్లడించారు.

ALSO READ : అనుపమ–ధృవ్ విక్రమ్ బ్రేకప్ రూమర్స్.. చెన్నై హోటల్ ఘటన నిజమేనా?

భారీ అంచనాల నడుమ విడుదల

‘జన నాయగన్’లో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, ప్రియమణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సెన్సార్ నుంచి ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా విడుదల తర్వాత కూడా రాజకీయ, సామాజిక అంశాల కారణంగా చర్చనీయాంశంగా నిలుస్తుందని దర్శకుడు హెచ్. వినోత్ ఆశాభావం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.