Gold Price: బంగారం, వెండి ధరలపై షాకింగ్ న్యూస్.. తగ్గినప్పుడు కొనడమే మంచిదంటున్న రాబర్ట్ కియోసాకి

Gold Price: ప్రస్తుతం బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు రికార్డు స్థాయిలో పరుగులు పెట్టిన రెండు లోహాలు క్రమంగా దిగి వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ధరలు దిగి వస్తున్నట్లుగానే రాబోయే రోజుల్లో మరింత తగ్గుతాయా? లేదా పెరుగుతాయా ? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వీటి ధరల్లో క్షీణత కనిపించినప్పటికీ, భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి, పెరుగుతున్న అప్పులు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల తాను ఈ ధరల తగ్గుదలను పెట్టుబడి పెట్టడానికి ఒక మంచి అవకాశంగా భావించి మరింత బంగారం, వెండిని కొనుగోలు చేసినట్లు ఆయన వెల్లడించారు.
ప్రముఖ దిగ్గజ పెట్టుబడిదారుడు జిమ్ రోజర్స్ చేసిన అంచనాలను కియోసాకి ప్రస్తావించారు. భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతాయని జిమ్ రోజర్స్ చెప్పారు. అయితే, ఈ పరుగులో మధ్యమధ్యలో ధరలు భారీగా తగ్గే అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. జిమ్ రోజర్స్ చెప్పిన ఈ అభిప్రాయంతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు కియోసాకి తెలిపారు.
తగ్గుదల సమయాల్లోనే కొనుగోళ్లు:
ఇటీవల బంగారం, వెండి ధరలు వాటి గరిష్ట స్థాయిల నుండి కొంత మేర కిందకు దిగివచ్చాయి. చాలా మంది సాధారణ పెట్టుబడిదారులు ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు కొని, ధరలు తగ్గగానే భయంతో విక్రయిస్తుంటారని, కానీ తాను మాత్రం ఈ తగ్గుదల సమయాన్ని ఉపయోగించుకుని తన పోర్ట్‌ఫోలియోలో మరింత బంగారం, వెండిని చేర్చుకున్నానని కియోసాకి చెప్పారు.
ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణంపై ఆందోళన:
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుత ఆర్థిక సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు విజయం సాధిస్తాయనే నమ్మకం తనకు లేదన్నారు. పెరుగుతున్న ప్రభుత్వ అప్పులు, ద్రవ్యోల్బణం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులకు దారితీయవచ్చని హెచ్చరించారు. ఈ క్రమంలో, పెట్టుబడిదారులు ధరలు పెరిగినప్పుడు కొని నష్టపోతారా? లేక ధరలు తగ్గినప్పుడు కొనుగోలు చేసి దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారా? అనేది వారి నిర్ణయానికే వదిలేశారు.
(గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న విషయాలు రాబర్ట్ కియోసాకి వ్యక్తిగత అభిప్రాయాలు, అంచనాలు మాత్రమే. బంగారం, వెండి మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం.)
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి