July 21, 2026

Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్

Rohit Sharma: ఎప్పుడు తప్పుకోవాలో రోహిత్‌కు తెలుసు.. మీరు మూసుకుంటే బెటర్: పాక్ మాజీ స్టార్
Reading Time: 2 minutes
Kamran Akmal Backs Rohit Sharma Amid Retirement Rumors After Lords Odi Century

Kamran Akmal Backs Rohit Sharma Amid Retirement Rumors: ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమి పాలై సిరీస్‌ను 2-1తో కోల్పోయినా.. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆడిన అద్భుత సెంచరీ మాత్రం అందరి ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో 138 పరుగులతో మెరిసిన రోహిత్.. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. ఈ ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ ప్రశంసలు కురిపించాడు. రోహిత్ ఇంకా ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌కు ఎప్పుడు తప్పుకోవాలో తెలుసు అని, మీరు మూసుకుంటే బెటర్ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు.

‘ది గేమ్ ప్లాన్’ పోడ్‌కాస్ట్‌లో కమ్రాన్ అక్మల్ మట్లాడుతూ… ‘టీమిండియాపై సిరీస్‌ గెలవడానికి ఇంగ్లండ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి. లార్డ్స్ వన్డేలో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ మాత్రం రోహిత్ శర్మ సెంచరీనే. హిట్‌మ్యాన్‌ భవిష్యత్తుపై ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. 2027 ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతడు ఉండడని కూడా ప్రచారం జరిగింది. అయితే లార్డ్స్‌లో ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో రోహిత్ తన బ్యాట్ ద్వారానే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తాను ఇప్పటికీ ఒకడినని నిరూపించాడు. హిట్‌మ్యాన్‌ బ్యాటింగ్ అద్భుతం’ అని అన్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లను విమర్శల ఆధారంగా అంచనా వేయకూడదని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు. ‘దిగ్గజ ఆటగాళ్లను వారి ప్రదర్శనల ఆధారంగానే అంచనా వేయాలి. రోహిత్, కోహ్లీ లాంటి క్రికెటర్లను ఎవరూ బలవంతంగా జట్టు నుంచి పంపించలేరు. ఎప్పుడు తప్పుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. భారత క్రికెట్ కోసం ఇద్దరూ ఎన్నో త్యాగాలు చేశారు. జట్టు ప్రయోజనాల కోసం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా వెనుకాడలేదు. అందుకే వారు ఇప్పటికీ సూపర్‌ స్టార్లుగా కొనసాగుతున్నారు. విమర్శలు, ఫామ్ కోల్పోవడం సహజమే. రో-కోలనుతప్పించడం ఎవరి వల్ల కాదు. విమర్శకులు, మాజీలు ట్రోల్స్ చేయకుంటే బెటర్’ అని అక్మల్ సూచించాడు.

భారత్ బ్యాటింగ్ బాగానే ఉన్నప్పటికీ బౌలర్ల వైఫల్యమే ఓటమికి ప్రధాన కారణమని అక్మల్ చెప్పాడు. ‘ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ భారీగా పరుగులు ఇచ్చారు. గుర్నూర్ బ్రార్ ఏకంగా 97 పరుగులు ఇవ్వడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. ప్రధాన బౌలర్లు ఒక్కొక్కరు 70 నుంచి 100 పరుగుల వరకు ఇస్తే ప్రత్యర్థిని నియంత్రించడం చాలా కష్టం. జట్టులో కుల్దీప్ యాదవ్ లేకపోవడం కూడా భారత్‌కు తీవ్ర నష్టం కలిగించింది. అక్షర్ పటేల్ ఒక్కడే ప్రధాన స్పిన్నర్‌గా ఉండడంతో బౌలింగ్‌లో వైవిధ్యం కనిపించలేడు. వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న కుల్దీప్ ఆడుంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. చివరి ఐదు ఓవర్లలో భారత్ 80కు పైగా పరుగులు ఇవ్వడం మ్యాచ్‌ను పూర్తిగా ఇంగ్లండ్ వైపు తిప్పింది. బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది’ అని అక్మల్ చెప్పుకొచ్చాడు.