July 20, 2026

Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!

Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
Reading Time: < 1 minute
Tcs Market Cap Rises 72000 Crore Top Companies Growth

Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో గత వారం నమోదైన ర్యాలీకి దేశంలోని అతిపెద్ద కంపెనీలు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్‌లోని టాప్-10 అత్యంత విలువైన కంపెనీల్లో ఐదు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ.1.54 లక్షల కోట్లకు పైగా పెరిగింది. ఇందులో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అత్యధిక లాభాన్ని నమోదు చేయడం విశేషం. గత వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 582.06 పాయింట్లు (0.75%), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 127.40 పాయింట్లు (0.52%) పెరిగి ముగిశాయి. మార్కెట్‌లో పెరిగిన ఇన్వెస్టర్ల విశ్వాసం, కొనుగోళ్ల జోరు కారణంగా ప్రముఖ కంపెనీల మార్కెట్ విలువలు గణనీయంగా పెరిగాయి.

గత వారంలో మార్కెట్ విలువ పరంగా అత్యధిక లాభం పొందిన సంస్థగా TCS నిలిచింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.72,072.30 కోట్లు పెరిగి రూ.8.20 లక్షల కోట్లకు పైగా చేరుకుంది. ఇటీవల ప్రకటించిన జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 4.61 శాతం పెరగడం, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచింది. దీంతో TCS షేర్లకు భారీగా కొనుగోళ్ల మద్దతు లభించింది. అదే సమయంలో ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ విలువ సుమారు రూ.29,062 కోట్లు పెరిగి రూ.10.34 లక్షల కోట్లకు చేరుకుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.23,885 కోట్లు, బజాజ్ ఫైనాన్స్ రూ.21,947 కోట్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) రూ.7,338 కోట్లు పెరిగాయి.

అయితే అన్ని ప్రముఖ కంపెనీలకు గత వారం లాభాలు దక్కలేదు. లార్సన్ అండ్ టుబ్రో (L&T) మార్కెట్ విలువలో అత్యధిక తగ్గుదల నమోదైంది. కంపెనీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.18,098 కోట్లు తగ్గింది. ఇక ఎల్‌ఐసీ మార్కెట్ విలువ రూ.12,081 కోట్లు, భారతి ఎయిర్‌టెల్ రూ.7,706 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.7,085 కోట్లు, హిందుస్థాన్ యూనిలీవర్ రూ.1,222 కోట్లు తగ్గాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ దేశంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారతి ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, ఎల్‌ఐసీ, లార్సన్ అండ్ టుబ్రో, హిందుస్థాన్ యూనిలీవర్ ఉన్నాయి.