హాస్పిటళ్ల పనితీరుపై డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తం : మంత్రి దామోదర రాజనర్సింహ

- ఓపీ నుంచి ఐపీ వరకు అన్ని సేవలపై నిరంతర నిఘా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరును మెరుగుపరిచేందుకు ఇకపై నిరంతరం సమీక్షిస్తామని, ఇందుకోసం ప్రత్యేకంగా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం డీఎంఈ, టీవీవీపీ వంద బెడ్ల ప్రభుత్వ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓపీ, ఐపీ సేవలు, శస్త్రచికిత్సలు, అత్యవసర సేవలు, మాతా-శిశు ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలను క్వాలిటీ ఇండికేటర్ల ఆధారంగా అంచనా వేస్తామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లు, సిబ్బందికి ప్రోత్సాహకాలు ఉంటాయని, విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సౌకర్యాలు కల్పిస్తున్నం.. సాకులు చెప్పొద్దు
సర్కారు దవాఖానాల్లో వైద్య సేవలు మెరుగుపడడంతో పేషెంట్ల నమ్మకం పెరిగిందని, అందుకే హాస్పిటల్స్ కు వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని మంత్రి దామోదర్ పేర్కొన్నారు. అదే సమయంలో ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్లే పేషెంట్ల సంఖ్య తగ్గుతోందని యజమానులే చెబుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం కొత్త భవనాలు నిర్మించి, అవసరమైన మందులు, సర్జికల్స్ అన్నీ సమకూరుస్తోందని.. వనరులన్నీ ఉన్నప్పుడు సేవల విషయంలో సాకులు చెప్పొద్దని అధికారులకు సూచించారు.
అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ దాక కేర్ తీసుకోవాలి
ప్రతి సూపరింటెండెంట్ తన హాస్పిటల్ ను ఓన్ చేసుకోవాలని, పేషంట్ అడుగుపెట్టిన నాటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వ్యవస్థను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. ప్రతిరోజూ వార్డులను సందర్శించి పేషెంట్లతో మాట్లాడాలని, పారిశుద్ధ్యం, తాగునీరు, భోజనం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఐసీయూలు, ల్యాబ్‌లు, బ్లడ్ బ్యాంకులు 24 గంటలు పనిచేయాలని, వైద్య పరికరాలు చెడిపోతే వెంటనే రిపేర్ చేయించాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, రోగులను వెయిట్ చేయిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, టీజీఎంఎస్‌ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్, డీఎంఈ నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.