Gold Rust: బంగారం ఎప్పటికీ తుప్పు ఎందుకు పట్టదు? దాని మెరుపు వెనుక ఉన్న రహస్యం ఏంటి?
Gold Rust: మానవ చరిత్రలో బంగారానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ధర ఎంత పెరిగినా షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. మన భారతీయ సాంప్రదాయంలో పసిడికి ప్రత్యేక స్థానముంది. మహిళలకు అత్యంతగా ఇష్టపడేది బంగారం. అయితే బంగారం ఎన్నేళ్లు అయినా చెక్కు చెదరకుండా ఉంటుంది. వేల సంవత్సరాల క్రితం భూమిలో దాచిన బంగారు నాణాలు, ఆభరణాలు ఈరోజు తవ్వి తీసినా నిన్న మొన్న చేసిన వాటిలాగే తళతళలాడుతూ ఉంటాయి. ఇనుము లాంటి లోహాలు కొద్దిరోజులు తేమ తగిలితేనే తుప్పు పట్టి పాడైపోతాయి. కానీ బంగారం మాత్రం వేల ఏళ్లయినా అలాగే ఉంటుంది. అసలు బంగారం ఎందుకు తుప్పు పట్టదు? దాని మెరుపు ఎప్పటికీ ఎందుకు తగ్గదు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. రసాయనిక నిష్క్రియాత్మకత: రసాయన శాస్త్రం (Chemistry) ప్రకారం, బంగారం ఒక “నోబెల్ మెటల్” (Noble Metal). అంటే ఇది చాలా జడత్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. వేరే ఇతర మూలకాలతో లేదా రసాయనాలతో ఇది అంత త్వరగా ప్రతిచర్య (react) జరపదు. ఆవర్తన పట్టిక (Periodic Table) లో బంగారం సంకేతం Au (Aurum). దీని అణు సంఖ్య 79. దీని ఎలక్ట్రాన్ అమరిక చాలా స్థిరంగా ఉంటుంది. అందువల్ల ఇది తన ఎలక్ట్రాన్లను అంత సులభంగా కోల్పోదు.
2. ఆక్సిజన్‌తో చర్య జరపకపోవడం: ఇనుము తుప్పు పట్టడానికి ప్రధాన కారణం ఆక్సిడేషన్ (Oxidation). ఇనుము గాలిలోని ఆక్సిజన్, తేమతో చర్య జరిపి ‘ఐరన్ ఆక్సైడ్’ (తుప్పు) గా మారుతుంది. కానీ బంగారం విషయానికి వస్తే గాలిలోని ఆక్సిజన్ లేదా నీటి అణువులు దీనిపై ఎలాంటి ప్రభావం చూపలేవు. బంగారం ఆక్సిజన్‌తో అస్సలు ప్రతిచర్య జరపదు. అందుకే దీనికి ఆక్సైడ్ పొర ఏర్పడదు. ఫలితంగా ఇది ఎప్పటికీ తుప్పు పట్టదు.
3. ఆమ్లాల (Acids) ను సైతం తట్టుకుంటుంది: సాధారణ ఆమ్లాలు (Acids) కూడా బంగారాన్ని ఏమీ చేయలేవు. హైడ్రోక్లోరిక్ యాసిడ్ లేదా నైట్రిక్ యాసిడ్ విడివిడిగా బంగారంతో చర్య జరపలేవు. కేవలం నైట్రిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ల మిశ్రమమైన “ఆక్వా రీజియా” అనే ద్రావణం మాత్రమే బంగారాన్ని కరిగించగలదు. అందుకే బంగారాన్ని స్వచ్ఛమైన లోహంగా భావిస్తారు.
ఒక ముఖ్యమైన విషయం: మనం వాడే కొన్ని బంగారు ఆభరణాలు కాలక్రమేణా కాస్త రంగు మారడం లేదా మెరుపు తగ్గడం గమనించే ఉంటారు. దానికి కారణం స్వచ్ఛమైన బంగారం కాదు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం చాలా మెత్తగా ఉంటుంది. అందుకే నగలు చేయడానికి అందులో రాగి, వెండి లేదా జింక్ వంటి ఇతర లోహాలను కలుపుతారు (ఉదాహరణకు 22 క్యారెట్ లేదా 18 క్యారెట్ బంగారం). అలా కలిపిన ఇతర లోహాలు గాలిలోని సల్ఫర్ లేదా ఆక్సిజన్‌తో చర్య జరపడం వల్ల నగలు కాస్త మసకబారినట్లు అనిపిస్తాయి తప్ప, అసలైన బంగారానికి ఏమీ కాదు.
ప్రకృతిలో లభించే అత్యంత స్థిరమైన, అందమైన లోహాలలో బంగారం ఒకటి. దాని విలక్షణమైన పసుపు రంగు మెరుపు, ఎప్పటికీ పాడవని గుణమే దానికి అంతర్జాతీయ మార్కెట్లో అంతటి విలువను, డిమాండ్‌ను తెచ్చిపెట్టాయి. సైన్స్ పరంగా చూస్తే, బంగారం ఎప్పటికీ తుప్పు పట్టకపోవడమే దానికి లభించిన అతిపెద్ద వరం.





