ఐర్లాండ్, ఇంగ్లాండ్ సీన్ రిపీట్ చేస్తాం.. టీమిండియాకు వార్నింగ్ ఇచ్చిన జింబాబ్వే కెప్టెన్..!

Sikandar Raza Comments on Team India: భారత్, జింబాబ్వే మధ్య గురువారం నుంచి ప్రారంభం కానున్న ముడు టీ20ల సిరీస్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ పర్యటనలో టీమిండియాను ఏకపక్ష విజేతగా ఎవరు భావించకూడదని, గెలిచే అవకాశాలు ఇరు జట్లకూ సమానంగా ఉన్నాయని జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా స్పష్టం చేశాడు. మ్యాచ్‌లకు ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారాయి.
హరారే వేదికగా రసవత్తర పోరు.. రజా ఏమన్నారంటే?
సొంతగడ్డపై భారత్‌తో తలపడటానికి తాము పరిపూర్ణంగా సిద్ధమయ్యామని జింబాబ్వే టీ20 సారథి సికిందర్ రజా ధీమా వ్యక్తం చేశాడు. స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తమను తక్కువ అంచనా వేయడం ప్రత్యర్థికి మంచిది కాదని వ్యాఖ్యానించాడు. ఈ సిరీస్ రెండు జట్లకూ ఎంతో కీలకమైనదని, అభిమానులకు సరికొత్త క్రికెట్ మజా అందించడం ఖాయమని తెలిపాడు.
ఇదికూడా చదవండి: ఆల్‌రౌండర్ మోజులో అసలైన వికెట్ టేకర్ బలి.. భారత్ కొంపముంచుతోన్న గంభీర్ మొండి పట్టుదల
“ఈ పోరులో రెండు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. మేము గత కొంతకాలంగా అత్యుత్తమ స్థిరత్వంతో పాటు నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నాం. అందుకే ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠగా సాగుతుంది” అని 136 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన అనుభవజ్ఞుడైన రజా పేర్కొన్నారు.
మార్పుల దశలో రెండు జట్లు.. ఏకపక్ష సిరీస్ కానే కాదు..!
ప్రస్తుతం భారత జట్టు ట్రాన్సిషన్ దశలో ఉందని, అలాగే జింబాబ్వే జట్టులోనూ నూతన రక్తం తోడవుతోందని రజా గుర్తుచేశాడు. జట్టు నిర్మాణం మారుతున్న తరుణంలో ఏ జట్టూ పూర్తి ఆధిపత్యం చలాయించలేదని ఆయన అభిప్రాయపడ్డాడు.
“టీమిండియా ప్రస్తుతం కొత్త ఆటగాళ్లతో పునర్నిర్మాణ ప్రక్రియలో ఉంది. మరోవైపు మా జట్టులోనూ కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఈ సిరీస్ ఏకపక్షంగా సాగుతుందని నేనైతే అనుకోవడం లేదు. పోరాటం హోరాహోరీగా ఉంటుంది” అని ఆయన విశ్లేషించాడు.
వరుస పరాజయాల్లో భారత్.. పటిష్ట స్థితిలో జింబాబ్వే..!
ఇటీవల ముగిసిన ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో భారత జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బెల్ ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2తో ఓటమి పాలైన భారత్, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-4తో చేజార్చుకుంది. అంతేకాకుండా శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని వన్డే జట్టు కూడా 1-2తో సిరీస్ కోల్పోయింది. ఈ ఓటముల భారం నుంచి తేరుకోవడానికి భారత్‌కు ఈ సిరీస్ ఎంతో ముఖ్యం.
ఇదికూడా చదవండి: టీమిండియా పరువు తీశారుగా.. ఆ ఒక్కడిని పక్కనపెట్టి పెద్ద తప్పు చేశారయ్యా గంభీర్..!
మరోవైపు జింబాబ్వే ఇటీవలి కాలంలో సంచలన విజయాలతో దూసుకుపోతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కొలంబో వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాను 23 పరుగుల తేడాతో ఓడించి టోర్నీ నుంచే పంపించివేసింది. అంతేకాకుండా శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి ఆసియా దిగ్గజాలపై కూడా ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ విజయాలు జింబాబ్వే ఆటగాళ్ల ఆత్మవిశ్వాసాన్ని ఆకాశానికి ఎత్తాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..