July 21, 2026

భారతదేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని మోడీనే: రాహుల్ గాంధీ

భారతదేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని మోడీనే: రాహుల్ గాంధీ
Reading Time: 2 minutes

భారతదేశ చరిత్రలోనే అత్యంత యువత వ్యతిరేక ప్రధాని మోడీనే: రాహుల్ గాంధీ

Caption of Image.

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే యువత అత్యంత వ్యతిరేక ప్రధాని మోడీనే అని అభివర్ణించారు. పరీక్షలు నిర్వహించడంలో దారుణంగా విఫలమైన విద్యాశాఖ మంత్రిని కనీసం రాజీనామా చేయమని కోరలేని అసమర్థ ప్రధాని మోడీ అని విమర్శించారు. 

నీట్ పేపర్ 2026 లీక్‎కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం (జులై 20) కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరుపై రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న నిరసనకారులపై లాఠీచార్జ్, టియర్ ప్రయోగం చేయడాన్ని ఉద్దేశిస్తూ మోడీ సర్కార్‎పై ఆయన ధ్వజమెత్తారు. 

బీజేపీ ప్రభుత్వ హయాంలో 152 ప్రశ్నపత్రాల లీక్ కాగా.. 7.5 కోట్ల మంది విద్యార్థులు బాధితులయ్యారని అన్నారు. ఇప్పటి వరకు ఒక్క దోషికి కూడా శిక్ష పడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ కష్టపడి చదివిన యువతకు మాత్రం శిక్ష పడిందని మండిపడ్డారు. పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలోని లోపాలపై ప్రశ్నించిన యువతపై లాఠీ దెబ్బలు, నిర్బంధాలు విధించారని నిప్పులు చెరిగారు.

 ప్రశ్నపత్రాలను లీక్ చేసిన నేరగాళ్లు స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. కానీ సమస్యలు లేవనెత్తిన విద్యార్థులను ఈడ్చుకెళ్లి దారుణంగా కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ పేపర్ లీకులతో యువత జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా.. తిరిగి వారిపైనే దాడి చేస్తోందని తూర్పారబట్టారు.

సీజేపీ చలో పార్లమెంట్:

 నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జులై 20న చలో పార్లమెంట్ కార్యక్రమానికి క్రాకోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది. సీజేపీ పిలుపు మేరకు యువత పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకుని చలో పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సీజేపీ పార్లమెంట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. 

అనుమతి లేదని సీజేపీ మద్దతుదారులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, సీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పోలీసులు విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ యువత వెనక్కి తగ్గకుండా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించింది. 

సీజేపీ మద్దతుదారులు పార్లమెంట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు పార్లమెంట్ గేట్స్ క్లోజ్ చేసి సీజేపీ సపోర్టర్స్ ను అదుపులోకి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పార్లమెంట్‌ బయట ఫైర్‌ బ్రిగేడ్లతో భారీగా పోలీసులను మోహరించారు. పార్లమెంట్ బయట సీజేపీ.. లోపల ప్రతిపక్షాల నిరసనలతో సోమవారం (జులై 20) దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. 

©️ VIL Media Pvt Ltd.