Sonam Wangchuk: సోనమ్ వాంగ్‌చుక్‌ను ఆస్పత్రికి తరలించడం సరైనదే: ఢిల్లీ హైకోర్టు

Sonam Wangchuk: సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను జంతర్ మంతర్ నుంచి సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించిన ప్రభుత్వం నిర్ణయం సరైనదే అని, ఏకపక్షం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలిక నిరాహారదీక్ష వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వానికి ఆస్పత్రి తరలించే హక్కు ఉందని స్పష్టం చేసింది. వాంగ్‌చుక్ అక్రమంగా నిర్బంధించారనే ఆయన భార్య ఆరోపణల్ని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రస్తుతానికి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు.
వాంగ్‌చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై తమకు నమ్మకం లేదని, ఆయనను మేదాంతా ఆసుపత్రికి తరలించేందుకు అనుమతించాలని ఆమె కోరారు. ఆరోగ్యం క్షీణించడం వల్లే ఆయనను ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని ప్రభుత్వం కోర్టు తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి రీత్యా ప్రభుత్వ నిర్ణయానని యాదృచ్చిక చర్యగా చెప్పలేమని కోర్టు వ్యాఖ్యానించింది.
వాంగ్‌చుక్ తరుఫున వాదిస్తున్న కపిల్ సిబల్, ఆయనను నిర్బంధ ఉత్తర్వులు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచడం సరైనదా అని ప్రశ్నించారు. ఇందుకు కోర్టు ఆయన నిర్బంధంలో లేరని, ఆయన స్వేచ్ఛాయుత పౌరుడేనని స్పష్టం చేసింది. ఆయన స్వచ్ఛందంగా ఆస్పత్రికి వెళ్లలేదని, ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం తరలించడం సమంజసమే అని చెప్పింది. వాంగ్‌చుక్ శారీరక స్వేచ్చ ఉల్లంఘన జరుగుతుందనే వాదనల్ని కోర్టు తిరస్కరించింది. ఆయన సమ్మతితోనే వైద్యులు చికిత్స అందించినట్లు పేర్కొంది. ఇదే సమయంలో వాంగ్ చుక్ అవసరమైన వైద్య చికిత్స విషయంలో వైద్యులతో సహకరించాలని హైకోర్టు సూచించింది.