క్రైమ్ ప్లాన్ కోసం AI టెక్నాలజీ వాడిన బెంగళూరు టెక్కీ..! లివిన్ ప్రేయసి ఫ్యామిలీ ఖతమ్

ఏఐ మన జీవితాలను సులభతరం చేయడానికి రూపొందించిన టెక్నాలజీ. కానీ అదే టెక్నాలజీని ఒక వ్యక్తి నేరానికి ఉపయోగించాడనే ఆరోపణలు ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. బెంగళూరులో ఓ టెక్కీ తన లైవ్-ఇన్ భాగస్వామి ఫ్యామిలీ హత్యకు ముందు నెలల పాటు AI చాట్‌బాట్‌ను ఉపయోగించాడనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఘటన టెక్నాలజీ వినియోగం, మానసిక ఒంటరితనం, డిజిటల్ ప్రభావాలపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.
బెంగళూరులోని కేఆర్ పురం ప్రాంతంలో జరిగిన ఈ కేసులో 25 ఏళ్ల టెక్కీ కెన్నెత్, అతని లైవ్-ఇన్ పార్ట్‌నర్ శ్వేత సోమసుందర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శ్వేత తల్లి ముత్తులక్ష్మి (48), తండ్రి సోమసుందర్ (54), చెల్లెలు సుప్రియా (20) హత్యలకు సంబంధించి ఈ ఇద్దరిపై ఆరోపణలు ఉన్నాయి. జూన్ 22న సాయి గ్రీన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కెన్నెత్ హత్య ప్రణాళికకు ముందు సుమారు 6 నెలల పాటు ఏఐ చాట్‌బాట్‌ను సంప్రదించినట్లు గుర్తించారు పోలీసులు.
మొదట క్లౌడ్ కిచెన్ వ్యాపారం కోసం కెన్నెత్ ఒక ఇనుప కొలిమిని తయారు చేశాడు. తర్వాత చిన్న వివాదాలు, ఆర్థిక ఒత్తిళ్లు, వ్యక్తిగత సమస్యలు కలిసిపోయి నేర ఆలోచనకు దారితీసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. హత్య తర్వాత ఆధారాలను ఎలా తొలగించాలి, శవాలను స్పాట్ నుంచి ఎలా తరలించాలి, రక్తపు మరకలను ఎలా తుడిచేయాలి వంటి అంశాలపై కూడా ఏఐ ద్వారా సమాచారం తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కారణంగా దర్యాప్తులో AI చాట్ రికార్డులు కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉంది.
ఈ కేసులో పోలీసులు ప్రధానంగా మరో అంశాన్ని కూడా గుర్తించారు. కెన్నెత్, శ్వేత ఇద్దరూ సమాజానికి దూరంగా ఉంటూ.. తమ సమస్యలను ఇతరులతో పంచుకోకుండా టెక్నాలజీపైనే ఎక్కువగా ఆధారపడ్డారని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో అనే కోణంలో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. శ్వేత ఆర్థిక ఒత్తిళ్లు, కుటుంబ సంబంధాల్లో వచ్చిన విభేదాలు కూడా ఈ ఘటనకు ఒక కారణంగా పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటన AIపై కొత్త భయాలను కాకుండా, దాన్ని మనుషులు ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంపై పెద్ద చర్చను మొదలుపెట్టింది. ఏఐ ఒక టెక్నికల్ టూల్ మాత్రమే అయినప్పటికీ.. దానిని బాధ్యతారహితంగా ఉపయోగిస్తే ప్రమాదకర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బెంగళూరు ఘటనలో డిజిటల్ ఆధారాలు, మానసిక పరిస్థితులు, సంబంధాల ప్రభావం అన్నీ కలిసిన కేసుగా మారింది.