July 21, 2026

Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?

Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
Reading Time: 2 minutes
Rohit Sharma Retirement Childhood Coach Dinesh Lad Reveals Why Hitman Wont Quit Before 2027 World Cup

Childhood Coach Dinesh Lad about Rohit Sharma Retirement: ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇటీవల హిట్‌మ్యాన్‌ ఫామ్, భవిష్యత్తుపై విమర్శలు, రిటైర్మెంట్ ఊహాగానాల మధ్య 110 బంతుల్లో 138 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో విమర్శకులకు తన బ్యాట్ ద్వారానే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్ వన్డే అనంతరం రోహిత్ వీడ్కోలు అని వచ్చిన వార్తలు అన్ని వట్టివే అని తేలిపోయింది. రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్ తాజాగా స్పందిస్తూ హిట్‌మ్యాన్ ఎందుకు ఇంకా రిటైర్మెంట్ గురించి ఆలోచించడం లేదో వెల్లడించారు.

రెండు రోజుల ముందే మాట్లాడా:

దినేశ్ లాడ్ పిటీఐతో మాట్లాడుతూ… ‘లార్డ్స్ వన్డేకు రెండు రోజుల ముందే రోహిత్‌ శర్మతో నేను మాట్లాడాను. 2027 వన్డే ప్రపంచ కప్‌లో నువ్ ఆడితే చూడాలనుకుంటున్నా అని చెప్పాను. తప్పకుండా ఆడుతా అని నాతో అన్నాడు. మెగా టోర్నీలో భారత జట్టులో హిట్‌మ్యాన్‌ ఉంటాడనే నమ్మకం నాకు ఉంది. లార్డ్స్‌లో ఆడిన ఇన్నింగ్స్‌తో రోహిత్ తన సామర్థ్యం ఏమిటో మరోసారి ప్రపంచానికి చూపించాడు. లార్డ్స్ మైదానంలో అతడు అద్భుతంగా ఆడాడు. నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పారు

జట్టు కోసం చాలా కష్టపడతాడు:

రోహిత్ శర్మ రిటైర్ కావాల్సిన సమయం వచ్చిందని, ఇక యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని చాలా మంది విమర్శించినా హిట్‌మ్యాన్‌ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు అని దినేశ్ లాడ్ చెప్పారు. ‘రోహిత్ ప్రతిభపై నాకు ఎప్పుడూ నమ్మకం ఉంటుంది. లార్డ్స్‌లో అతను ఒత్తిడిని ఎలా ఎదుర్కొన్నాడో, ఇన్నింగ్స్‌ను ఎంత అద్భుతంగా నిర్మించాడో చూస్తే.. అతడి అనుభవం, నైపుణ్యం, మానసిక దృఢత్వం అర్థమవుతాయి. విమర్శకులకు తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. విమర్శలు ఎప్పుడూ ఉంటాయి. కానీ అవి రోహిత్‌ను ఏమాత్రం ప్రభావితం చేయవు. అతని దృష్టంతా జట్టు విజయంపైనే ఉంటుంది. జట్టు కోసం చాలా కష్టపడతాడు’ అని వివరించారు.

రోహిత్ మనసులో రెండు గాయాలు:

‘రోహిత్ శర్మ ఇంకా వన్డే క్రికెట్ కొనసాగించాలనుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. 2011 ప్రపంచ కప్ విజేత జట్టులో చోటు దక్కకపోవడం ఇప్పటికీ రోహిత్‌ను బాధిస్తోంది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఈ రెండు సంఘటనలు రోహిత్ మనసులో బలంగా ముద్రపడ్డాయి. అప్పటి నుంచి భారత్‌కు వన్డే ప్రపంచ కప్‌ను అందించడమే అతడి లక్ష్యంగా మారింది’ అని దినేశ్ లాడ్ వెల్లడించారు.

ప్రపంచ కప్ గెలిచే వరకు రిటైర్మెంట్ లేదు:

‘రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ఐసీసీ ట్రోఫీలు గెలిచాడు. ఇంకా వన్డే ప్రపంచ కప్ మాత్రమే మిగిలి ఉంది. భారత్ 2027 వన్డే ప్రపంచ కప్ గెలవాలంటే రోహిత్ శర్మ జట్టులో తప్పనిసరిగా ఉండాలి. అతనిలో ఇంకా పరుగుల దాహం అలానే ఉంది. మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలిచే సామర్థ్యం ఉంది. అందుకే వన్డే ప్రపంచ కప్ గెలిచే వరకు రోహిత్ రిటైర్మెంట్ గురించి ఆలోచించే అవకాశం లేదు’ అని దినేశ్ లాడ్ స్పష్టం చేశారు.