Shabana Azmi: ప్రధాని మోదీకి లేఖ రాసినా నో రెస్పాన్స్.. అందుకే రోడ్డుపైకి వచ్చా: నటి శబానా అజ్మీ

ఢిల్లీ వేదికగా జరుగుతున్న విద్యార్థుల నిరసనలకు బాలీవుడ్ సీనియర్ నటి, మాజీ ఎంపీ శబానా అజ్మీ మద్దతు పలకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న ఆందోళనల్లో ఆదివారం (జూలై 19) ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మరో వైపు కాక్రోచ్ జనతా పార్టీ ( CJP ) చలో పార్లమెంట్ కు పిలుపునిచ్చింది.
ప్రధానికి లేఖ..
ఈ సందర్భంగా శబానా అజ్మీ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు పంచుకున్నారు. పరిస్థితి చేతులు దాటిపోయినప్పుడే నేను స్పందిస్తాను. నాకు 75 ఏళ్లు.. ప్రతి చిన్న విషయానికి మాట్లాడను. నన్ను లోపల నుండి తీవ్రంగా కలచివేసినప్పుడే నా గొంతు విప్పుతాను అంటూ ఎమోషనల్ అయ్యారు. విద్యార్థుల సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీకి తాను, జావేద్ అఖ్తర్ కలిసి లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు. మేము మాజీ రాజ్యసభ సభ్యులుగా ప్రధానికి లేఖ రాశాం. దీనిని పబ్లిక్ మ్యాటర్ చేయం, ప్రెస్‌కి వెళ్లం.. కేవలం మాతో చర్చలు జరపండి అని కోరాం. రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. కానీ 4 రోజులు దాటినా రిప్లై రాకపోవడంతోనే 5వ రోజు నేను ఇక్కడికి వచ్చాను అని శబానా స్పష్టం చేశారు.
దీక్షకు మద్దతు..
గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న నేహా అనే యువతిని శబానా అజ్మీ పరామర్శించారు. ఆమె పక్కన కూర్చుని, ప్రేమగా ముఖాన్ని నిమురుతూ, ఆమె చేతిపై ముద్దు పెట్టి సంఘీభావం తెలిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
హీటెక్కిన జంతర్ మంతర్
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో కాక్‌రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో పార్లమెంట్ మార్చ్‌కు పిలుపునిచ్చింది. జంతర్ మంతర్ నుంచి ర్యాలీగా బయల్డేరిన వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిరసనకారులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
మరోవైపు శబానా అజ్మీతో పాటు ఇప్పటికే ప్రకాష్ రాజ్, పూనమ్ పాండే వంటి వారు జంతర్ మంతర్ వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. అలాగే సోషల్ మీడియా వేదికగా జీనత్ అమన్, అభయ్ డియోల్, సోనాక్షి సిన్హా, నసీరుద్దీన్ షా, రత్నా పాఠక్ షా వంటి ఎందరో బాలీవుడ్ స్టార్స్ ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తుండటంతో ఈ పోరాటం మరింత రసవత్తరంగా మారింది.