July 21, 2026

Tollywood : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?

Tollywood  : ఏం నమ్మి బడ్జెట్ పెడుతున్నారు ?
Reading Time: 2 minutes
Tollywood Box Office Crisis Hero Remuneration Over Budget Issues

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతి ఏటా వందకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ, అందులో కనీసం పది చిత్రాలు కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టలేకపోతున్నాయి. అసలు సినిమా పరాజయానికి బాధ్యులెవరు? ప్రేక్షకులు నిజంగానే సినిమాలను తిరస్కరిస్తున్నారా? అంటే ప్రస్తుత టాలీవుడ్ సమీకరణాలు వేరే నిజాలను చెప్తున్నాయి. కథను నమ్ముకోకుండా, కేవలం స్టార్ హీరోల ఇమేజ్ వెనుక పరిగెత్తడమే టాలీవుడ్ ను పట్టి పీడిస్తోన్న అతిపెద్ద శాపం. ఒక హీరో బిజినెస్ రేంజ్ ఎంత? అతనికి జనాదరణ ఏ స్థాయిలో ఉంది? అనే కనీస అంచనాలు లేకుండా కొత్త నిర్మాతలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. 30 కోట్ల రూపాయలతో పూర్తవ్వాల్సిన సినిమాకు భజన స్టోరీలు, విదేశీ షూటింగులు, భారీ గ్రాఫిక్స్ అంటూ ఏకంగా 70 నుండి 100 కోట్లు బడ్జెట్ పెంచేస్తున్నారు. అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ చిత్రానికి బడ్జెట్ పరిమితులు దాటి 70 కోట్లు ఖర్చు చేయడం, హీరోకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వడం వల్లే ఆ చిత్రం నిర్మాతలకు ఊహించని నష్టాలను తెచ్చిపెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని ఫ్యామిలీ మార్కెట్ పై సరైన అవగాహన లేకపోవడమే దీనికి కారణం.

స్థానిక కథలకు పాన్ ఇండియా రంగు పూసి బడ్జెట్ పెంచడం మరో కొత్త ట్రెండ్. ఉత్తరాంధ్ర నేపథ్యమున్న ఓ రీజినల్ కథకు ఏకంగా 150 కోట్లు పెట్టి, అందులో 80 శాతం బడ్జెట్ ను హీరో రామ్ చరణ్ రెమ్యునరేషన్ కే కేటాయించడం లాంటి నిర్ణయాలు ఇండస్ట్రీని అతలాకుతలం చేస్తున్నాయి. రాధేశ్యామ్, రాజా సాబ్, గేమ్ చేంజర్, ఆచార్య వంటి భారీ చిత్రాలు బడ్జెట్ నియంత్రణ లేకపోవడం వల్లే బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి. అఖండ 2 లాంటి సినిమాలకు 150 కోట్లు పెట్టడం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ కేవలం 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి, 100 కోట్ల వసూళ్లతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. చిన్న బడ్జెట్ సినిమాలు నేడు ఇండస్ట్రీకి వరంగా మారుతున్నాయి. టాలీవుడ్ హీరోలు తమ రెమ్యునరేషన్లను తగ్గించుకుని, లాభాల్లో వాటాలు తీసుకునే పద్ధతికి శ్రీకారం చుడితేనే నిర్మాతలు అప్పుల పాలు కాకుండా సేఫ్ జోన్ లో ఉంటారు. కథను నమ్మి, బడ్జెట్ పై పట్టు సాధించినప్పుడే తెలుగు పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది.