July 21, 2026

Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!

Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
Reading Time: < 1 minute
Sai Krishna Lockup Death Case Private Complaint Filed Against Ap Dgp Top Police Officials

Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) ఎం. మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఈ రోజు అనగా.. జూలై 21న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు. పిటిషన్‌లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఏ-1, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబును ఏ-2, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం. మానసను ఏ-3గా పేర్కొన్నారు.

పిటిషన్‌లో చేసిన ఆరోపణల ప్రకారం, సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ఆయన అదృశ్యం కావడం, అనంతరం మరణించే వరకు జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. అలాగే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను విజయవాడ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే అదుపులోకి తీసుకుందని పిటిషన్‌లో ప్రస్తావించారు. టాస్క్ ఫోర్స్ నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున అరెస్టు విషయం కమిషనర్‌కు తెలియదని చెప్పడం సాధ్యం కాదని పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి వారిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని కోర్టును కోరారు. అయితే, ఈ ప్రైవేట్ ఫిర్యాదుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తదుపరి విచారణ, కోర్టు ఆదేశాలు కీలకంగా మారనున్నాయి.