టీజీసీపీ గెట్ -2026 ప్రొవిజనల్ కీ విడుదల

హసన్ పర్తి, వెలుగు: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసీపీగెట్–2026 పరీక్షల ప్రొవిజనల్ కీ విడుదలైంది. కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షల కీని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్టు టీజీసీపీగెట్ కన్వీనర్ రాజేందర్ కట్ల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రొవిజనల్ కీపై అభ్యర్థులకు అభ్యంతరాలు లేదా సందేహాలు ఉంటే ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని కన్వీనర్ పేర్కొన్నారు.
అభ్యర్థులు జులై 20వ తేదీ మధ్యాహ్నం 1:40 గంటలలోపు తమ అభ్యంతరాలను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని చెప్పారు. అయితే, అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలనూ ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబోమని కన్వీనర్ స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, ప్రొవిజనల్ కీని పరిశీలించుకోవాలని, ఏవైనా తప్పులుంటే నిర్ణీత గడువులోగా తమ అభ్యంతరాలను సమర్పించాలని సూచించారు.