ఓటర్ల నమోదులో అక్రమాలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అర్హులైన ఓటర్లు జాబితాలో చేరకుండా అడ్డుకుంటూ.. క్షేత్రస్థాయి అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారని తెలిపారు. రాంచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించింది.
సర్ ప్రక్రియలో ఇబ్బందులను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ… హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాంతాల్లో వేలాది మంది ఉద్యోగులు, ఇతర రాష్ట్రాల వారు స్థిరపడ్డారని, వారంతా నివసిస్తున్న చోట ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. బీఎల్‌ఓలపై రాజకీయ నేతలు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఓటర్లను చేర్చుకోకుండా వారిని భయపెడుతున్నారని తెలిపారు. నార్త్ ఇండియన్స్, ఐటీ ప్రొఫెషనల్స్ ఓట్లు నమోదు కాకుండా కుట్రలు జరుగుతున్నాయని, ఇది ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేశారు.
బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా మాజీ సైనికులు పనిచేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన ఎక్స్-సర్వీస్‌మెన్ సెల్ ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారిగా ప్రతి జిల్లాకు కన్వీనర్లతో ఈ సెల్ బలమైన వింగ్‌గా ఏర్పడడం సంతోషకరమన్నారు. న్యాయవాదులకు లీగల్ సెల్ ఉన్నట్టే, మాజీ సైనికుల సమస్యల పరిష్కారానికి ఈ సెల్ అండగా ఉంటుందని, జులై 26న రాష్ట్రవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.