July 19, 2026

Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..

Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
Reading Time: < 1 minute
Bahadurguda Land Acquisition Protest

Bahadurguda Land Row : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో శనివారం మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం బహదూర్‌గూడలో భూసేకరణ చేపట్టేందుకు రెవెన్యూ, హైడ్రా (HYDRAA) అధికారులు రంగంలోకి దిగారు. సేకరించిన భూమి చుట్టూ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా, స్థానిక రైతులు దీనిని తీవ్రంగా అడ్డుకున్నారు. ఏళ్ల తరబడి తాము సాగు చేసుకుంటున్న పంట పొలాలను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని రైతులు ఆందోళనకు దిగారు. వీరికి మద్దతుగా రంగారెడ్డి జిల్లా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రత్యామ్నాయం చూపించాల్సిందే.. ఫెన్సింగ్ ధ్వంసం

అధికారులు అకస్మాత్తుగా వచ్చి తమ జీవనాధారమైన సాగు భూములను స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకోమని, తమకు ప్రత్యామ్నాయంగా భూమికి భూమి కేటాయించిన తర్వాతనే ఇక్కడి నుండి వెళ్తామని రైతులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్‌డీవో (RDO) స్వయంగా వచ్చి సమాధానం చెప్పేంతవరకు ఫెన్సింగ్ ప్రక్రియను నిలిపివేయాలని బీజేపీ నాయకులు, రైతులు అధికారులను కోరారు. అయితే, వారి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ పనులను కొనసాగించారు. ఉదయం నుండి తాము చేస్తున్న నిరసనను అధికారులు బేఖాతరు చేయడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతులు, నాయకులు కలిసి అధికారులు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్‌ను ధ్వంసం చేశారు.

పోలీసులపై కారప్పొడి ప్రయోగం.. పలువురు అరెస్ట్

ఫెన్సింగ్ ధ్వంసంతో బహదూర్‌గూడలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య తలెత్తింది. ఉద్రిక్తత పెరగడంతో ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో స్థానిక నిరసనకారులు తాము వెంట తెచ్చుకున్న కారప్పొడిని పోలీసులపై చల్లారు. కళ్లలో కారప్పొడి పడటంతో పలువురు పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయినప్పటికీ పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, ఆందోళనకు దిగిన రైతులతో పాటు బీజేపీ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.