ఇరాన్‌పై ఆగని అమెరికా దాడులు! ఉక్రెయిన్‌లో వాణిజ్య నౌకపై దాడి.. రష్యాకు భారత్ సమన్లు!

ఇరాన్, అమెరికా మధ్య యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. రెండు దేశాల మధ్య క్షిపణి, డ్రోన్ దాడులతో గల్ఫ్ ప్రాంతంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వాషింగ్టన్ వరుసగా 10వ రోజు కూడా ఇరాన్‌పై క్షిపణి, డ్రోన్‌లతో దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలపై దాడులను ముమ్మరం చేస్తోంది. అటు ఇరాన్ కూడా వెనక్కి తగ్గట్లేదు. బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక రక్షణ వ్యవస్థపై దాడి చేసినట్లు ఇరాన్ వెల్లడించింది.
మరో వైపు హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై కూడా దాడులు జరిగాయి. దీంతో జలసంధి వివాదంపైనా ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమ దేశ భద్రతను దెబ్బతీసేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చి చెప్పింది. ఇరాన్ జాతీయ ప్రయోజనాలు, భద్రతకు భంగం కలిగించేలా హర్మూజ్ జలసంధిని దుర్వినియోగం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.
రష్యన్ దౌత్యవేత్తలకు భారత్ విదేశాంగ శాఖ సమన్లు
ఇదిలా ఉండగా.. అటు ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై జరిగిన దాడిలో నలుగురు భారతీయుల దుర్మరణం చెందారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ మేరకు రష్యా దౌత్యవేత్తకు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. రష్యన్ దౌత్యవేత్తను పిలిపించి నిరసన తెలిపింది. నౌకపై దాడికి గల కారణాలు, వివరాలపై వెంటనే స్పష్టత ఇవ్వాలని రష్యాను కోరింది. అలాగే ఈ ప్రమాదంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు ప్రభుత్వ సానుభూతి తెలిపింది. మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు చర్యలు చేపట్టింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.