Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్‌కు ఏమైంది?.. సర్జరీ తర్వాత బిగ్ బి ఎమోషనల్ పోస్ట్.. అభిమానుల్లో ఆందోళన

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆరోగ్య పరిస్థితిపై బాలీవుడ్ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. 83 ఏళ్ల వయసులో తాను సర్జరీ చేయించుకున్నట్లు, అమితాబ్ తాజాగా తన వ్యక్తిగత బ్లాగ్‌లో ఎమోషనల్ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం తాను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నప్పటికీ, అసలు సవాళ్లు ఇప్పుడే మొదలయ్యాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే జీవితంలో ఎంత గొప్ప విజేతగా నిలిచినా.. ఏదో ఒక రోజు ఓటమి ఎదురవుతుందని.. అలాంటి సమయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వారే నిజమైన విజేతలని రాసుకొచ్చారు బిగ్ బి. దానికితోడు ఇది ఎంతో కష్టమైన సమయమని కూడా అమితాబ్ బ్లాగ్‌లో రాయడంతో.. ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ తన ఆరోగ్య పరిస్థితిపై తాజాగా తన వ్యక్తిగత బ్లాగ్‌లో పంచుకున్నారు. ‘ఇంటికి వచ్చిన తర్వాత శారీరకంగా, మానసికంగా, ఆచరణాత్మకంగా ఇదే అత్యంత కష్టమైన దశ’ అని పేర్కొన్నారు. అనారోగ్యం జీవితాన్ని ఒక్కసారిగా మార్చేస్తుందని, క్లిష్ట పరిస్థితులను ప్రతి వ్యక్తి తనదైన విధంగా ఎదుర్కొంటాడని అమితాబ్ అన్నారు. అయితే తనకు ఏ కారణంతో సర్జరీ జరిగిందో మాత్రం బిగ్ బి వెల్లడించలేదు. ప్రస్తుతం అమితాబ్ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బిగ్ బి త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో మెసేజ్లు ద్వారా తెలియజేస్తున్నారు.
అమితాబ్ బ్లాగ్ పోస్ట్లో ఏముందంటే?
హాస్పిటల్ వాతావరణం vs ఇల్లు:
‘‘హాస్పిటల్లో ఉన్నప్పుడు, ఐసియు (ICU) లో నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది సంరక్షణలో చికిత్స పూర్తవుతుంది. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకుంటాం.. కానీ ఈ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కోలుకునే సమయమే శారీరకంగా, మానసికంగా, ఆచరణాత్మకంగా అత్యంత కష్టమైన దశ’’ అని బిగ్ బి చెప్పుకొచ్చారు. జీవితాంతం సవాళ్లను ఎదుర్కొన్న వారైనా సరే, ఏదో ఒక సమయంలో బలహీనతలకు లోనవ్వక తప్పదని అమితాబ్ అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు భిన్నంగా స్పందిస్తారని పేర్కొన్నారు.
In his latest blog, #AmitabhBachchan has shared a health update after undergoing surgery.
While he did not disclose the reason for the surgery, the veteran actor revealed that the period after returning home has been the toughest part of his recovery. #Celebs pic.twitter.com/OnItDcM3a8
— Filmfare (@filmfare) July 21, 2026
ఛాంపియన్ పోరాటం:
‘‘నువ్వు ఒక గొప్ప ఛాంపియన్‌వి కావచ్చు.. కానీ ఏదో ఒక రోజు ఓటమి నీ వైపు చూస్తుంది. అది జీవితంలో అత్యంత కష్టమైన సమయం. కొందరు ధైర్యంగా పోరాడతారు, కొందరు లొంగిపోతారు. ధైర్యంగా పోరాడేవారు ఎప్పటికీ ఛాంపియన్లుగానే మిగిలిపోతారు. మిగిలిన వారు పాత జ్ఞాపకాలతో రాజీపడి జీవిస్తారు. ఇది ఎవరికి వారే ఎంచుకునే మార్గం.. ఇందులో ఏదీ తప్పు కాదు’’ అని అమితాబ్ తన బ్లాగ్ పోస్ట్లో చెప్పుకొచ్చారు. అయితే, ఈ పోస్ట్ చేయడం వెనుక ఉన్న అసలు విషయాన్ని మాత్రం అమితాబ్ వెల్లడించలేదు.
ALSO READ : ‘టాక్సిక్’ నుంచి ‘మనసాగదే’ సాంగ్ రిలీజ్..
‘కల్కి 2898 AD’ సీక్వెల్ లో బిజీగా అమితాబ్..
గత కొన్నేళ్లుగా అమితాబ్ బచ్చన్ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నప్పటికీ, తన వృత్తిపరమైన ప్రయాణాన్ని మాత్రం రెట్టింపు ఉత్సాహంతో కొనసాగిస్తున్నారు. సినిమాలు, టీవీ షోలు, సోషల్ మీడియా వేదికలపై చురుకుగా ఉంటూనే అభిమానులతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో తన కీలక పాత్ర కోసం షూటింగ్‌లో పాల్గొంటూ సెట్స్‌లో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటూనే తన సినిమా కమిట్‌మెంట్లను పూర్తి చేయడంపై అమితాబ్ దృష్టి సారించారు.