July 20, 2026

Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!

Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్‌చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
Reading Time: < 1 minute
Sonam Wangchuk Wife Moves Supreme Court Delhi High Court Order

Geetanjali Angmo: లడఖ్‌కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌‌కు సంబంధించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో, ఆయన భార్య డాక్టర్ గీతాంజలి ఆంగ్మో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వును సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె, ఈ కేసును అత్యవసరంగా సోమవారం విచారణకు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ను కోరారు.

ఇదిలా ఉండగా, సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారంటూ డాక్టర్ గీతాంజలి తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ఆరోగ్యం క్షీణించలేదని, అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసు అధికారులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారని ఆమె ఆరోపించారు. ఆసుపత్రిలోని పరిస్థితులు, పోలీసుల వ్యవహారం ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య నివేదికల్లో సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి సాధారణంగానే ఉందని తెలిపారు. ఆయన వైద్య రిపోర్ట్ సాధారణంగా ఉందని పేర్కొన్నారు. ఆరోగ్యం క్షీణించిందన్న వాదన వాస్తవాలకు విరుద్ధమని ఆమె వెల్లడించారు. అలాగే, ప్రభుత్వానికి నిజంగా ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే సాధారణ వైద్య పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి నిర్ణయం తీసుకోవాల్సిందని, బలవంతంగా ఆసుపత్రికి తరలించడం సరైన విధానం కాదని విమర్శించారు. ప్రభుత్వం చూపిస్తున్న ఆందోళన కేవలం “బూటకం” మాత్రమేనని ఆమె ఆరోపించారు.

మరోవైపు, సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టాలని భావించిన పాదయాత్రకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందనే భయంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు పాల్పడిందని గీతాంజలి ఆంగ్మో ఆరోపించారు. వాంగ్‌చుక్ లేకపోయినా ఉద్యమానికి మరింత ప్రజా మద్దతు లభిస్తుందని, ఈ పరిణామాల వల్ల ప్రజల్లో ఉత్సాహం రెట్టింపు అవుతుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో, అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.