FIFA World Cup 2026 : మెస్సీ ఆడే ఆటకి గేట్లు వేసిన స్పెయిన్.. ఫైనల్లో అర్జెంటీనా ఓటమి వెనుక అసలు వ్యూహాలివే

FIFA World Cup 2026 : దశాబ్దాల పాటు తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ ఫుట్‌బాల్‌ను శాసించిన దిగ్గజం లియోనెల్ మెస్సీ చివరి ప్రపంచకప్ ప్రయాణం తీవ్ర నిరాశతో ముగిసింది. న్యూ జెర్సీలోని మెట్‌లైఫ్ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరులో స్పెయిన్ 1-0 గోల్ తేడాతో అర్జెంటీనాను ఓడించి కప్‌ను ముద్దాడింది. 39 ఏళ్ల వయసులో మళ్లీ కప్పు గెలవాలనే తపనతో మైదానంలో అడుగుపెట్టిన మెస్సీ, మ్యాచ్ ముగిసేసరికి ఓటమి తట్టుకోలేక మైదానంలోనే కన్నీటిపర్యంతమయ్యాడు. తన సహచరులు రన్నరప్ మెడల్స్ అందుకుంటున్న సమయంలో మెస్సీ తన బాధను దిగమింగుకుంటూ ఏడవడం మైదానంలోని ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల హృదయాలను పిండేసింది.
మెస్సీ మైదానంలో ఏడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ (AFA) అత్యంత భావోద్వేగభరితమైన సందేశాన్ని రిలీజ్ చేసింది. “కెప్టెన్, నీ కళ్ల నుంచి వచ్చిన ప్రతి నీటిబొట్టు మా కన్నీళ్లతో సమానం. గతంలో మా జీవితాల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో గొప్ప సంతోషాలను నువ్వు మాకు అందించావు. ఆఖరి సెకను వరకు నువ్వు చూపిన అంకితభావానికి, మైదానంలో సృష్టించిన అద్భుతాలకు ధన్యవాదాలు” అని ఏఎఫ్ఏ తన అధికారిక ‘ఎక్స్’ (X) ఖాతాలో పోస్ట్ చేస్తూ తమ నాయకుడికి కొండంత అండగా నిలిచింది.
మ్యాచ్ ముగిసిన అనంతరం మైదానంలో ఒక చారిత్రాత్మక సన్నివేశం ఆవిష్కృతమైంది. స్పెయిన్ 19 ఏళ్ల యంగ్ సెన్సేషన్ లామైన్ యమాల్, కింద కూర్చుని బాధపడుతున్న మెస్సీ దగ్గరకు వచ్చి ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఓదార్చాడు. 2007లో కేవలం కొద్ది నెలల పసిపాపగా ఉన్న యమాల్‌ను మెస్సీ ఎత్తుకున్న ఫొటోలు ఇటీవల నెట్టింట హల్‌చల్ చేయగా, ఇప్పుడు అదే యమాల్ తన టీమ్‌తో వచ్చి ప్రపంచకప్ గెలిచాక మెస్సీని హగ్ చేసుకోవడం, ఫుట్‌బాల్ చరిత్రలోనే ‘పాసింగ్ ఆఫ్ ది టార్చ్’ (తరాల మార్పిడి) ఘట్టంగా నిలిచిపోతుందని క్రీడా విశ్లేషకులు అభివర్ణించారు.
Seeing Lionel Messi in tears hurts…
But he gave everything until the final whistle.
A champion, a leader, and a player who left his heart on the biggest stage.
Respect forever, Leo.
#WorldCupwithMicky #Messi pic.twitter.com/maVjPpttZh
— Micky Jnr (@MickyJnr__) July 20, 2026
అర్జెంటీనా ఓటమికి దారితీసిన 5 ప్రధాన కారణాలు ఇవే:
* ఫైనల్ మ్యాచ్‌కు ముందు వరకు 8 గోల్స్, 4 అసిస్ట్‌లతో టోర్నీ టాప్ స్కోరర్‌గా ఉన్న మెస్సీని స్పెయిన్ డిఫెండర్లు గట్టిగా కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభంలో మొదటి 15 నిమిషాల్లో మెస్సీ బంతిని కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే తాకగలిగాడంటే స్పెయిన్ వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మ్యాచ్‌లో మెస్సీ తన సహచరులకు ఒక్క కీ పాస్ కూడా అందించలేకపోవడంతో అర్జెంటీనా అటాకింగ్ విభాగం అచేతనంగా మారిపోయింది.
* ఫైనల్ మ్యాచ్ కంటే ముందు ఈ టోర్నీలో ఏకంగా 19 గోల్స్ కొట్టిన అర్జెంటీనా, స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. నిర్ణీత 90 నిమిషాల వ్యవధిలో అర్జెంటీనా స్పెయిన్ గోల్ పోస్ట్ వైపు ఒక్క షాట్ కూడా కొట్టలేకపోయింది. మొత్తం 120 నిమిషాల ఆటలో అర్జెంటీనా చేసిన ప్రయత్నాలు కేవలం 2 మాత్రమే కాగా, స్పెయిన్ ఏకంగా 20 సార్లు గోల్ పోస్ట్‌పై దాడి చేయడం మ్యాచ్‌లో ఆధిపత్యాన్ని నిరూపిస్తోంది.
* టోర్నీ అంతటా చూపించినట్టే ఫైనల్లోనూ స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ విభాగం (ముఖ్యంగా రోడ్రి, డాని ఒల్మో) బంతిపై పూర్తి కంట్రోల్ సాధించింది. అర్జెంటీనకు కనీసం బంతిని పొసెషన్‌లో ఉంచుకునే అవకాశం ఇవ్వకుండా నిరంతరం ఒత్తిడి పెంచింది. స్పెయిన్ ఆటగాళ్లు వేగంగా పాస్‌లు ఇస్తూ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు.
* అర్జెంటీనా రక్షణ శ్రేణిలో క్రిస్టియన్ రోమెరో, లిసాండ్రో మార్టినెజ్ జోడీ లీడ్ రోల్ పోషించింది. అయితే ఫైనల్ మ్యాచ్ తొలి సగం (హాఫ్‌టైమ్) ముగిసే ముందు లిసాండ్రో మార్టినెజ్ గాయపడటంతో కోచ్ స్కలోని ఆయన స్థానంలో 38 ఏళ్ల సీనియర్ నికోలాస్ ఒటామెండిని మైదానంలోకి దించాల్సి వచ్చింది. దీనివల్ల అర్జెంటీనా డిఫెన్స్‌లో వేగం తగ్గి సమతుల్యత దెబ్బతింది.
* నిర్ణీత సమయం (90 నిమిషాలు) ముగిసే క్రమంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ ఎన్జొ ఫెర్నాండెజ్, స్పెయిన్ డిఫెండర్ పౌ కుబార్సిపై తీవ్రమైన ఫౌల్ చేసి రెండో ఎల్లో కార్డ్‌తో రెడ్ కార్డ్ మూటగట్టుకున్నాడు. టోర్నీ మొత్తం మీద కేవలం ఒక్క గోల్ మాత్రమే ఇచ్చి ఇనుపకోటలా ఉన్న స్పెయిన్ డిఫెన్స్‌ను 10 మంది ఆటగాళ్లతో ఛేదించడం అర్జెంటీనాకు సాధ్యపడలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఈ అదనపు ఆటగాడి ప్రయోజనాన్ని వాడుకున్న స్పెయిన్, 106వ నిమిషంలో ఫెర్రాన్ టొర్రెస్ ద్వారా విన్నింగ్ గోల్ సాధించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



