Telangana Eco Tourism : తెలంగాణ ఎకో టూరిజం బూస్ట్.. కొత్త మాస్టర్ ప్లాన్.!

Telangana Eco Tourism : తెలంగాణలో పర్యావరణ పర్యాటక రంగాన్ని (Eco-Tourism) కొత్త పుంతలు తొక్కిందేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి అత్యంత సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులతో పాటు కిన్నెరసాని, నల్లమల, భద్రాచలం, ఆదిలాబాద్, ములుగు వంటి దట్టమైన అటవీ, సహజ సౌందర్య ప్రాంతాల్లో పర్యాటకరంగాన్ని విస్తరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నారు. ఎకో టూరిజం ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్ర పర్యాటక ఆదాయాన్ని , మొత్తం జీడీపీ (GDP) ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను నూరు శాతం సమర్థవంతంగా వినియోగించుకోవాలని, అలాగే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) పద్ధతిలో పెట్టుబడులను ఆకర్షించి కొత్త ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎస్ సూచించారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లు రెండూ పూర్తి సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ, అనంతగిరి, వికారాబాద్ తదితర కీలక ప్రాంతాల్లో పర్యావరణ సమతుల్యతకు, ప్రకృతి పరిరక్షణకు ఎలాంటి భంగం కలగకుండా అత్యుత్తమ స్థాయి పర్యాటక వసతులను అభివృద్ధి చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.