ఇండియా నుంచి నీళ్లు ఇప్పించమని కెనడాను వేడుకున్న పాక్.. ఇస్లామాబాద్‌కి దక్కింది నిరాశే

ఒకప్పుడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్‌తో సమాన హక్కుగా వినియోగించిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఒప్పందాన్ని మళ్లీ అమల్లోకి తీసుకురావాలని ప్రపంచ దేశాల సపోర్ట్ కోసం ప్రయత్నిస్తోంది. భారత్ ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత పెరుగుతున్న నీటి సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఇస్లామాబాద్.. తాజాగా కెనడా సాయం కోరడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే పాక్ ఆశించిన మద్దతు మాత్రం కెనడా నుంచి బహిరంగంగా రాకపోవడంతో షాక్ తగిలింది.
కెనడా విదేశాంగ మంత్రిని ఆశ్రయించిన పాక్:
దాదాపు 2 దశాబ్దాల తర్వాత కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ పాకిస్థాన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ సంయుక్త మీడియా సమావేశంలో భారత్ నిలిపివేసిన సింధు జలాల ఒప్పందాన్ని వెంటనే పునరుద్ధరించేందుకు కెనడా మద్దతు ఇవ్వాలని కోరారు. నీటిని “ఆయుధంగా” ఉపయోగించకూడదని.. స్నేహపూర్వక దేశాలు పాకిస్థాన్‌కు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
కెనడా స్పందన ఏమిటి?
అయితే పాకిస్థాన్ విజ్ఞప్తిపై కెనడా ఎలాంటి బహిరంగ మద్దతు ప్రకటించలేదు. రెండు దేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం ప్రస్తావనే లేదు. బదులుగా వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, రెన్యూవబుల్ ఎనర్జీ, ఉగ్రవాద నిరోధం, అభివృద్ధి ప్రాజెక్టులపైనే చర్చలు జరిగాయి. అంతేకాకుండా పాకిస్థాన్‌లో ఎడ్యుకేషన్, హెల్త్, వాతావరణ మార్పుల ప్రాజెక్టుల కోసం కెనడా ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది.
భారత్ వైఖరి మారలేదు:
2025లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలులో నుంచి నిలిపివేసింది. సరిహద్దు దాటి ఉగ్రవాదానికి పాకిస్థాన్ పూర్తిగా ముగింపు పలికే వరకు ఒప్పందం పునరుద్ధరణ ఉండదని స్పష్టం చేసింది. ప్రధాని మోడీ కూడా “రక్తం, నీరు ఒకేసారి ప్రవహించలేవు” అంటూ పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింధు జలాల ఒప్పందం తిరిగి అమల్లోకి వచ్చే అవకాశాలు చాలా తక్కువని భారత వర్గాలు చెబుతున్నాయి.
60 ఏళ్ల ఒప్పందం.. ఇప్పుడు ప్రతిష్ఠంభన:
1960లో ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన సింధు జలాల ఒప్పందం ప్రకారం రవి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు పూర్తి హక్కులు లభించగా.. సింధు, జీలం, చెనాబ్ నదుల జలాలను పాకిస్థాన్ వినియోగించే హక్కు పొందింది. అయితే పశ్చిమ నదులపై భారత్‌కు జలవిద్యుత్ ప్రాజెక్టులు నిర్మించే పరిమిత హక్కులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య వివాదం అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతోంది.
పాక్‌కు ఎదురవుతున్న దౌత్య పరీక్ష:
సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ కోసం పాకిస్థాన్ ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టాలని ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు పెద్ద దేశాల నుంచి స్పష్టమైన సపోర్ట్ మాత్రం లభించలేదు. మరోవైపు భారత్ మాత్రం ఉగ్రవాద అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ తన వైఖరిని మార్చే సూచనలు ఇవ్వడం లేదు. దీంతో నీటి అంశం ఇప్పుడు కేవలం నదుల వివాదంగా కాకుండా, భారత్–పాకిస్థాన్ మధ్య దౌత్య, భద్రతా, వ్యూహాత్మక సంబంధాలను ప్రభావితం చేసే కీలక అంశంగా మారింది.