Viral Video: ఆఫీస్ టైమ్ దాటిన తర్వాత.. ఉద్యోగులను లోపలే బంధించిన బ్యాంక్ మేనేజర్! ఏం చేశాడంటే..

భారతదేశంలో కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాలలో పని ఒత్తిడి, బాస్‌ల ప్రవర్తనపై తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుంటాయి. తాజాగా ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్న ఒక వైరల్ వీడియో ఈ చర్చను మరింత తీవ్రం చేసింది. ఆఫీస్ సమయం అయిపోయినప్పటికీ ఉద్యోగులను ఇంటికి వెళ్లనివ్వకుండా, బ్యాంక్ మేనేజర్ ఒకరు ఏకంగా బ్రాంచ్ ప్రధాన ద్వారానికి తాళం వేసి లోపలే బంధించినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో విపరీతమైన ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా షేర్ అయిన ఈ వీడియోలో, ఒక బ్యాంక్ మేనేజర్ ఆఫీస్ సమయం అయిపోయిన తర్వాత మెయిన్ గేట్‌ను మూసివేసి తాళం వేస్తుండటం కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఉద్యోగులు తాము ఇంటికి వెళ్లాలని, గేట్ తీయాలని కోరగా.. మేనేజర్ నిరాకరించాడు. ముందు పని పూర్తి చేయండి, ఆ తర్వాతే ఎవరైనా బయటికి వెళ్ళాలి అని మేనేజర్ ఉద్యోగులతో అనడం వీడియోలో వినబడుతోంది. ఒక ఉద్యోగి ఓవర్‌టైమ్ చేయడం నిబంధనల ప్రకారం తప్పనిసరి కాదు అని అభ్యంతరం చెప్పినప్పటికీ, మేనేజర్ వినకుండా గేట్‌కు లాక్ చేసి లోపలికి వెళ్లిపోయాడు.
ఇంటర్‌నెట్‌లో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా ఆఫీసుల్లో బంధించడం వారి హక్కులను ఉల్లంఘించడమేనని, ఇది తీవ్రమైన శ్రమ దోపిడీ అని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగుల భద్రతను కూడా లెక్కచేయకుండా ఇలా చేయడం దారుణమని కొందరు పేర్కొన్నారు. ఈ దృశ్యాన్ని చూసి కొందరు నెటిజన్లు జోకులు కూడా పేల్చారు. ఇది చూస్తుంటే లో-బడ్జెట్ మనీ హైస్ట్ వెబ్ సిరీస్ లాగా ఉంది అని ఒకరు, ఒకవేళ ఓవర్‌టైమ్ చేయిస్తే దానికి తగ్గ డబ్బులు ఇవ్వాలి కదా అని మరొకరు కామెంట్ చేశారు.
వీడియో ఇక్కడ చూడండి..
Bank Manager locks gate and forces staff to stay in branch till late night pic.twitter.com/oSFLwa5O4o
— Hellobanker (@Hellobanker_in) July 19, 2026
ఇదిలా ఉంటే, ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నప్పటికీ, ఇది ఏ బ్యాంకుకు చెందిన శాఖ? ఏ నగరంలో జరిగింది? ఏ రోజున రికార్డ్ చేయబడింది? అనే విషయాలపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. సదరు బ్యాంక్ యాజమాన్యం గానీ, ప్రభుత్వ అధికారులు గానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.అంతేకాదు.. ఈ వీడియో నిజమా కాదా అనేది పక్కన పెడితే, కార్పొరేట్ బ్యాంకింగ్ రంగాలలో ఉద్యోగులపై పెరుగుతున్న టార్గెట్ల ఒత్తిడి, అదనపు పని గంటలు, మానసిక వేధింపుల వంటి సమస్యలను ఈ ఘటన మరోసారి సమాజం ముందుకు తెచ్చింది.