July 19, 2026

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి.. పునరావాసం కింద 5 ఎకరాల భూమి, రూ.15 లక్షలు

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి.. పునరావాసం కింద  5 ఎకరాల భూమి, రూ.15 లక్షలు
Reading Time: 2 minutes

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధి.. పునరావాసం కింద 5 ఎకరాల భూమి, రూ.15 లక్షలు

Caption of Image.

కోడేరు(పెద్దకొత్తపల్లి), వెలుగు: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని అటవీ గ్రామాల ప్రజల పునరావాసానికి ప్రభుత్వం ప్రతీ కుటుంబానికి 5 ఎకరాల భూమితో పాటు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.15 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామంలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ గ్రామాల స్వచ్ఛంద పునరావాస పథకం–1 కార్యక్రమంలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ గ్రామాల ప్రజలు వన్యప్రాణుల మధ్య భయాందోళనలతో జీవించడం బాధాకరమన్నారు. తొలి విడతలో 256 మంది లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. పునరావాస కాలనీల్లో విద్య, వైద్యం, రహదారులు, క్రీడా వసతులు సహా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. లబ్ధిదారులతో స్వయంగా డ్రా నిర్వహించి ఇళ్ల సీరియల్ నంబర్లను ప్రకటించిన మంత్రి.. సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ మాట్లాడుతూ  అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలోని సార్లపల్లి, కుడిచింతల జైలు, తాటిగుండాలపెంట, కొల్లంపెంట గ్రామాల ప్రజలను బాచారం వద్ద ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలకు తరలిస్తున్నట్లు చెప్పారు.

గడువులోగా ‘సర్’​ పూర్తి చేస్తే నగదు బహుమతులు

వనపర్తి/పాన్​గల్ :  నిర్దేశిత గడువులోగా సర్వే ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసిన బూత్ లెవల్ ఆఫీసర్లు, బూత్ లెవల్ ఏజెంట్లను ప్రోత్సహించేందుకు తొలి బహుమతిగా రూ.10 వేలు, ద్వితీయ బహుమతిగా రూ.5 వేలు నగదు బహుమతులు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు. శనివారం వనపర్తి జిల్లా పాన్‌‌గల్, వీపనగండ్ల, చిన్నంబావి మండలాల్లో నిర్వహించిన సర్వే అవగాహన సదస్సుల్లో ఆయన మాట్లాడారు. కొన్ని గ్రామాల్లో సర్వే ప్రక్రియ మందకొడిగా సాగుతోందని, అధికారులు వెనుకబడిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతం చేయాలని ఆదేశించారు. గురువారం తాను మళ్లీ వస్తానని, అప్పటి వరకు 100 శాతం ఓటర్ జాబితా సవరణ పూర్తవ్వాలన్నారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తగ్గినందున రైతులు తగినంత ఎరువులనే వాడుతూ అప్పులపాలు కాకుండా చూసుకోవాలని సూచించారు. దావాజిపల్లి నుంచి పుల్గర్ జర్ల డబుల్ రోడ్డుకు రూ.42 కోట్లు, కేతెపల్లి నుంచి వీపనగండ్ల డబుల్ రోడ్డుకు రూ.32 కోట్లు మంజూరై నట్లు వెల్లడించారు. 
 

©️ VIL Media Pvt Ltd.