Rohit Sharma Retirement: నేటి మ్యాచ్‌కు రోహిత్ పేరెంట్స్.. హిట్‌మ్యాన్ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇదిగో..

Rohit Sharma Retirement: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో నిర్ణయాత్మక మూడో వన్డే (3rd ODI) జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే, సిరీస్ విజేతను తేల్చే ఈ కీలక పోరు కంటే ఎక్కువగా.. భారత సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ భవితవ్యంపైనే క్రీడా వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ మ్యాచ్ తర్వాత రోహిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడంటూ వస్తున్న ఊహాగానాలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారికంగా స్పందించింది. మీడియాలో వస్తున్న రిటైర్మెంట్ వార్తలను బీసీసీఐ (BCCI) పూర్తిగా ఖండించింది. లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ కాబోతోందంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని బోర్డు స్పష్టం చేసింది. ఈ విషయమై బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా స్పందిస్తూ.. “రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి మీడియాలో అనేక ఊహాగానాలు వస్తున్నాయి. కానీ, ఆదివారం లార్డ్స్ మైదానంలో రోహిత్ తన చివరి వన్డే ఆడబోతున్నాడనే చర్చ బోర్డులో కానీ, సెలక్టర్ల మధ్య కానీ ఎక్కడా జరగలేదు. రోహిత్ భారత వన్డే జట్టులో క్రమం తప్పకుండా ఆడే కీలక సభ్యుడు. జట్టు ప్రణాళికల్లో ఉన్నంతవరకు ఆయన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే, లార్డ్స్ వన్డే అతని చివరి మ్యాచ్ కాదు” అని తేల్చి చెప్పారు.
నేటి మ్యాచ్‌ను వీక్షించనున్న రోహిత్ పేరెంట్స్..
మరోవైపు.. రోహిత్ శర్మ పేరెంట్స్ నేటి మ్యాచ్‌ను వీక్షించేందుకు లండన్‌కు చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. టీమ్ఇండియా జెర్సీలో హిట్‌మ్యా్న్ ఆదివారం ఆడనున్న మ్యాచే చివరిది అని ప్రచారం సాగుతుండడంతో ఆ ప్రత్యేక సందర్భాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు అతని తల్లిదండ్రులు గురునాథ్ శర్మ, తల్లి పూర్ణిమ శర్మ లండన్‌కు చేరుకున్నారని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో తన భవిష్యత్తుకు సంబంధించిన ఈ విషయంపై రోహిత్‌కు ముందే అవగాహన ఉందని, అందుకే తన ఫేర్వెల్ మ్యాచ్ సమయంలో కుటుంబ సభ్యులు స్టేడియంలో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నాడని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు రెండు దశాబ్దాల పాటు సాగిన ఈ రోహిత్ కెరీర్లో ఈ పరిణామం అత్యంత భావోద్వేగంతో ఉండడం ఖాయంగా మారనుంది. ఓ వైపు మీడియాలో వస్తున్న వార్తలను బీసీసీఐ కొట్టేస్తున్నప్పటికీ అనేక అనుమానాలు వస్తునే ఉన్నాయి.
విరాట్‌కు ముందే తెలుసా?
ఇక, ఇటీవల రెండో వన్డే మ్యాచ్ జరుగుతున్న సమయంలో కెమెరా కంటికి చిక్కిన ఒక విజువల్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. డ్రెస్సింగ్ రూమ్‌లో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రాల మధ్య కూర్చున్న విరాట్ కోహ్లీ మొహం చాలా డల్‌గా, తీవ్ర నిరాశతో కనిపించింది. మొదట వికెట్ కోల్పోయిన బాధలోనే కోహ్లీ అలా ఉన్నాడని అందరూ అనుకున్నారు. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు తెరపైకి వచ్చాక.. రోహిత్ చివరి సిరీస్ ఆడబోతున్నాడనే బాధతోనే కోహ్లీ అలా ఎమోషనల్ అయ్యాడని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విశ్లేషిస్తున్నారు.
కామెంటరీలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
అదే మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి మైక్ అందుకుని రోహిత్ శర్మ సాధించిన ఘనతలను పదే పదే ప్రస్తావించారు. రోహిత్ నాయకత్వ ప్రతిభను, భారత క్రికెట్‌కు అతను అందించిన అద్భుతమైన సేవలను, అలాగే 2019 వరల్డ్ కప్‌లో యూకే గడ్డపైనే సాధించిన ఐదు సెంచరీల రికార్డును రవిశాస్త్రి ప్రత్యేకంగా గుర్తుచేశారు. మ్యాచ్ జరుగుతుండగా రోహిత్ కెరీర్ గొప్పతనాన్ని ఆయన అంతగా ఎలివేట్ చేయడం వెనుక.. లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డేనే రోహిత్ చివరి మ్యాచ్ కాబోతోందనే స్పష్టత రవిశాస్త్రికి ముందే ఉండటమే కారణమని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగానే నేడు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? లేదా? అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది. ఒకవేళ రోహిత్ నేడు రిటైర్మెంట్ ప్రకటిస్తే ఈ రోజు ఫ్యాన్స్‌కు ఎంతో భావోద్వేగంగా మారనుంది.