July 20, 2026

ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..

ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
Reading Time: 2 minutes
Virat Kohli Rohit Sharma 400 Matches Together Record Lords Odi Sir Garfield Sobers Tribute

లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో బరిలోకి దిగిన భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే జట్టు తరఫున కలిసి 400 మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జోడీగా వీరు అరుదైన మైలురాయిని అందుకున్నారు. క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఆరో జంటగా కోహ్లీ, రోహిత్ రికార్డుకెక్కారు. ఇప్పటివరకు ఈ జాబితాలో శ్రీలంకకు చెందిన కుమార్ సంగక్కర, మహేల జయవర్ధనే జోడీ 550 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే తిలకరత్నే దిల్షాన్-జయవర్ధనే 426 మ్యాచ్‌లు, సంగక్కర-దిల్షాన్ 418 మ్యాచ్‌లు, సనత్ జయసూర్య-ముత్తయ్య మురళీధరన్ 408 మ్యాచ్‌లు కలిసి ఆడారు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్ కాలిస్, మార్క్ బౌచర్ జోడీ 407 మ్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు ఈ దిగ్గజాల క్లబ్‌లోకి రోహిత్, కోహ్లీ చేరారు. గతంలో భారత్ తరఫున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ జోడీ కలిసి 391 మ్యాచ్‌లు ఆడింది.

భారత్ తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 664 మ్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ 562 మ్యాచ్‌లతో రెండో స్థానంలో, ఎమ్.ఎస్. ధోని 535 మ్యాచ్‌లతో మూడో స్థానంలో, రోహిత్ శర్మ 514 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకోగా, భారత జట్టు మోకాలి గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్‌ల స్థానాల్లో మూడు మార్పులతో బరిలోకి దిగింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు నిలకడగా ఆడుతూ 27 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 168 పరుగులు చేశారు.

ఈ సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతులకు నల్లటి పట్టీలు (బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్) ధరించి మైదానంలోకి దిగడం విశేషం. వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరైన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కన్నుమూయడంతో ఆయనకు నివాళిగా ఇరు జట్ల ఆటగాళ్లు ఈ విధంగా నల్లటి పట్టీలు ధరించారు. ఈ మేరకు భారత జట్టు మేనేజ్‌మెంట్ సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ, శుక్రవారం కన్నుమూసిన దిగ్గజ క్రికెటర్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్‌కు గౌరవ సూచకంగా టీమిండియా ఈ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్స్ ధరించిందని స్పష్టం చేసింది. ఒకవైపు కోహ్లీ, రోహిత్ చారిత్రాత్మక రికార్డు, మరోవైపు సోబర్స్ మృతికి క్రికెట్ ప్రపంచం నివాళులు అర్పించడంతో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మూడో వన్డే మ్యాచ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.