July 20, 2026

Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..

Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
Reading Time: < 1 minute
Ind Vs Eng Gurnoor Brar Worst Bowling Record Lords Odi

యువకుడు, మంచి ఎత్తు ఉన్నాడు, లార్డ్స్ లాంటి పిచ్‌లపై బౌలింగ్ బాగా వేస్తాడు.. ఇంగ్లాండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడతాడు అని సెలెక్టర్లు భావించారు. భారత అభిమానులు, నెటిజన్లు కూడా ఈ యువ పేసర్ నుంచి ఒక అద్భుతమైన స్పెల్‌ను ఆశించారు. కానీ కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది! లండన్‌లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆ బౌలర్‌కు చుక్కలు చూపించారు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 26 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ పేరిట ఒక అత్యంత చెత్త రికార్డు నమోదైంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.. భారత బౌలర్లపై విరుచుకుపడింది. నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 3 వికెట్ల నష్టానికి 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో భారత్‌పై ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. భారత బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 69 పరుగులిచ్చి రెండు వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 79 పరుగులిచ్చి ఒక వికెట్ తీశారు. అర్ష్‌దీప్ సింగ్ 72 పరుగులు, అక్షర్ పటేల్ 61 పరుగులు సమర్పించుకున్నారు. అయితే, అందరికంటే ఎక్కువగా గుర్నూర్ బ్రార్ ఇంగ్లాండ్ బ్యాటర్ల చేతిలో ఘోరంగా దెబ్బతిన్నాడు. అతను తన 10 ఓవర్ల కోటాలో ఏకంగా 97 పరుగులు సమర్పించుకుని, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీనితో లార్డ్స్ మైదానంలో ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్‌గా గుర్నూర్ బ్రార్ అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.

ఈ చెత్త ప్రదర్శనతో గుర్నూర్ 51 ఏళ్ల క్రితం నాటి కర్సన్ ఘావ్రీ (1975లో 83 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఒక వన్డేలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్ల జాబితాలో భువనేశ్వర్ కుమార్ (106), వినయ్ కుమార్ (102) తర్వాతి స్థానంలో గుర్నూర్ నిలిచాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌లో బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91) మొదటి వికెట్‌కు 192 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చివర్లో జో రూట్ (74 నాటౌట్), జోస్ బట్లర్ (41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ప్రస్తుతం భారత్ తన లక్ష్య సాధనలో 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 24 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తోంది.