యాక్సెంచర్ కొత్త శాలరీ హైక్ మోడల్.. ఉద్యోగులకు సగం జీతంతో, మరో సగం లంప్‌సమ్ పే

జీతం పెంపు అంటే సాధారణంగా ఉద్యోగుల బేసిక్ శాలరీ పెరగడం అని భావిస్తాం. కానీ ఇప్పుడు ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ కొత్త విధానంతో జీతాల పెంపులో కొత్త మార్గాన్ని తీసుకొచ్చింది. ఉద్యోగులకు వెంటనే డబ్బు అందేలా ఒక భాగాన్ని ఒకేసారి చెల్లించనుండగా.. మరో భాగాన్ని రెగ్యులర్ శాలరీ పెంపుగా మార్చనుంది. ఈ కొత్త విధానం ఉద్యోగులకు ప్రయోజనం కలిగించడంతో పాటు కంపెనీకి దీర్ఘకాలిక ఖర్చులను నియంత్రించుకునే అవకాశం ఇస్తోందట.
యాక్సెంచర్ కొత్త శాలరీ పే విధానం అర్హత ఉన్న ఉద్యోగికి ఎంత శాలరీ పెంపు ఇవ్వాలనేది ముందుగా టాలెంట్, గ్రూప్ లీడర్లు నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఆ పెంపును రెండు సమాన సగాలుగా విభజిస్తారు. ఒక భాగం ఉద్యోగి బేస్ శాలరీలో చేరుతుంది. మరో భాగం ఒకేసారి చెల్లించే లంప్‌సమ్ పేమెంట్‌గా అందుతుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగికి 3 శాతం జీతం పెంపు ఆమోదిస్తే.. అందులో 1.5 శాతం బేస్ పేలో కలుస్తుంది. మిగిలిన 1.5 శాతం ఒకేసారి క్యాష్ పేమెంట్ గా లభిస్తుంది.
ఈ మార్పు వెనుక ప్రధాన ఉద్దేశం ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రయోజనం కల్పించడమేనని కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అనేక సంస్థలు ఖర్చులను జాగ్రత్తగా నిర్వహిస్తున్నాయి. ఇలాంటి సమయంలో శాశ్వత జీతాల పెంపు వల్ల కంపెనీపై భవిష్యత్తులో పెరిగే వేతన భారం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక భాగాన్ని తక్షణ నగదు చెల్లింపుగా ఇవ్వడం ద్వారా ఉద్యోగులను సంతృప్తిపరుస్తూ, దీర్ఘకాలిక ఖర్చులను సమతుల్యం చేయాలని యాక్సెంచర్ భావిస్తోంది.
అయితే ఈ కొత్త విధానం అన్ని రకాల జీతాల పెంపులకు వర్తించదు. ప్రమోషన్ పొందే ఉద్యోగులకు వచ్చే శాలరీ పెంపు మొత్తం బేస్ పేలోనే కొనసాగుతుంది. అలాగే డిసెంబర్ హైక్ సైకిల్ లో ఇచ్చే సాధారణ పనితీరు బోనస్‌లపై ఈ మార్పు ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. ఉద్యోగుల వార్షిక ఇన్సెంటివ్ లెక్కల్లో బేస్ పే పెంపు, లంప్‌సమ్ చెల్లింపు రెండూ పరిగణనలోకి తీసుకుంటామని తెలిపింది.
ALSO READ : రూ.కోటి టాక్స్ కట్టినా ఉద్యోగం పోయాక సాయం లేదు..
ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు ఉద్యోగులను నిలుపుకోవడం, ఖర్చులను నియంత్రించడం మధ్య సమతుల్యం కోసం కొత్త వేతన విధానాలను అన్వేషిస్తున్నాయి. యాక్సెంచర్ తీసుకున్న ఈ నిర్ణయం కూడా అదే దిశలో ఒక అడుగుగా కనిపిస్తోంది. ఎక్కువ మంది ఉద్యోగులకు ప్రయోజనం అందిస్తూ.. కంపెనీ ఆర్థిక ప్రణాళికను కాపాడుకునేలా రూపొందించిన ఈ హైబ్రిడ్ శాలరీ మోడల్ భవిష్యత్తులో మరిన్ని సంస్థలు అనుసరించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.