శ్రీవారి భక్తులకు అలర్ట్: తిరుమలలో వసతి గదుల కేటాయింపుపై టీటీడీ కీలక అప్ డేట్..

తిరుమలలో వసతి గదుల విషయంలో శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది టీటీడీ. ఇకపై వసతి గదులు సులభంగా కేటాయించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. ఉప విచారణ కార్యాలయాల ద్వారా సులభంగా వసతి గదులు కేటాయించాలని నిర్ణయించింది టీటీడీ.భక్తులు ముందుగా తిరుమలలోని కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 5 గంటల నుండి సీఆర్వో కార్యాలయం తెరుచుకుంటుంది. గదుల అందుబాటులో ఉన్నంత వరకు సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపింది టీటీడీ.
భక్తులు క్యూలైన్ లో నిలబడి తమ వంతు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ కౌంటర్ దగ్గర తమ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా జిరాక్స్ కాపీని తీసుకెళ్లి ఫోన్ నెంబర్ వివరాలు తెలియజేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని… ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందని తెలిపింది టీటీడీ. కౌంటర్ దగ్గర రెండు కేటగిరీలకు సంబంధించిన గదుల్లో తమకు నచ్చిన కేటగిరీని ఎంచుకోవచ్చని తెలిపింది టీటీడీ.
A కేటగిరీలో రూ.50, రూ.100 గదులు, B కేటగిరీలో రూ.1000 గదులు ఉంటాయి. ఈ ప్రక్రియ పూర్తి కాగానే భక్తులకు ఒక అక్నాలెడ్జ్మెంట్ స్లిప్ ఇస్తారు. క్యూలైన్ల దగ్గర భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, అన్న ప్రసాదం, మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది టీటీడీ.
గదుల కోసం మార్గదర్శకాలు
- గదులు పొందడానికి 21 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి.
- ఒకసారి గదిని పొందిన వ్యక్తి 30 రోజుల వరకు తిరిగి గదిని పొందలేరు.
- ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తి మాత్రమే క్యూ లైన్ లోకి రావాలి.
- ఒంటరి వ్యక్తికి లేదా అవివాహితులకు గదులు కేటాయించబడవు.
రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక సీఆర్వో దగ్గర ఉన్న డిస్ప్లే బోర్డులలో వరుస క్రమంలో రిజిస్ట్రేషన్ సంఖ్య కనిపిస్తుంది. తమ క్రమ సంఖ్య కనిపించిన 15 నిమిషాలలోపు తమ సెల్ ఫోన్ కు కేటాయించిన గదికి సంబంధించిన సమాచారం మెసేజ్ వస్తుంది. ఒకవేళ డిస్ప్లే బోర్డుల్లో తమ రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చినప్పటికీ మెసేజ్ రాకపోతే సీఆర్వో దగ్గర ఏర్పాటు చేసిన కీయోస్క్ మిషన్లలో తమ స్లిప్ స్కాన్ చేస్తే తమకు కేటాయించిన గది వివరాలు చూపిస్తుంది.
అనంతరం భక్తులు వారికి గది కేటాయించిన ప్రాంతంలోని ఉప విచారణ కార్యాలయాలకు చేరుకుని గదికి సంబంధించిన రుసుమును ఆన్ లైన్ ద్వారా మాత్రమే చెల్లించి తాళాలు తీసుకోవాల్సి ఉంటుంది.
తిరుమలలోని ఉప విచారణ కార్యాలయాల వివరాలు
- అంజనాద్రి నగర్ కాటేజస్. (ANC)
- శ్రేషాద్రి నగర్ కాటేజస్. (SNC)
- శంఖుమిట్ట కాటేజస్. (SMC)
- గరుడాద్రి నగర్ కాటేజస్. (GNC)
- హిల్ వ్యూ కాటేజస్. (HVC)
- సుదర్శన సత్రం. (1NC)
- గోవర్ధన్ సత్రం. (2NC)
- కళ్యాణి సత్రం. (3NC)
- సప్తగిరి విశ్రాంతి గృహం. (SPRH)
- రామ్ భగిచా విశ్రాంతి గృహం-2. (RBRH-2)
- వరాహ స్వామి విశ్రాంతి గృహం -1. (VSRH-1)
- వరాహ స్వామి విశ్రాంతి గృహం -2. (VSRH-2)
- అష్ట వినాయక విశ్రాంతి గృహం. (AVSRH)
- కౌస్తుభం విశ్రాంతి గృహం. (KTBRH)
- పాంచజన్యం విశ్రాంతి గృహం. (PJMRH)
- మాతృశ్రీ వకుళామాత విశ్రాంతి గృహం. (MVRH)
- నందకం విశ్రాంతి గృహం. (NDKRH)
- సూరాపురం తోట (SPT)
గదులు పొందిన భక్తులు తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు
- గదులు 24 గంటలకు మాత్రమే కేటాయించబడతాయి. ఒకవేళ 24 గంటలు దాటితే టారీఫ్ 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం పెరుగుతుంది.
- నీరు మరియు విద్యుత్ ను వృథా చేయరాదు.
- తిరుమలలో ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను ఉపయోగించరాదు.
- జగ్గులు మరియు నీటి గ్లాసులను ఉపయోగించాలి, వాటిని శుభ్రంగా ఉంచాలి.
- తడి మరియు పొడి చెత్తను వాటికి వేరువేరుగా కేటాయించిన చెత్త బుట్టలలో వేయాలి.
- భక్తులు వారి వస్తువులను వారే బాధ్యత వహించాలి.
- గదులు పొందిన భక్తుడు/భక్తురాలు మాత్రమే గది ఖాళీ చేయాల్సి ఉంటుంది. లేకుంటే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.
- తమ గదిని వేరొకరికి ఇవ్వడం పూర్తిగా నిషిద్ధం. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయి.
భక్తులు పై నిబంధనలను, సూచనలను పాటిస్తూ కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్రతను కాపాడుతూ టీటీడీకి సహకరించగలరని కోరడమైనది.