కల్తీలపై కఠిన చట్టం..సమగ్ర చట్టాలు ఉన్న దేశాల్లో అమలుతీరుపై అధ్యయనం : సీఎం రేవంత్ రెడ్డి

- శాసనసభలో సమగ్రంగా చర్చించి ఆమోదం
- క్యూర్ పరిధిలో పైలెట్‌గా తొలుత అమలు
- సమాచార సేకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి
- ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కూరగాయలు, పండ్లు, పాలు అన్ని కల్తీబారిన పడుతుండడంతో ప్రతి ఒక్కరూ రోగాలపాలవుతున్నారని సీఎం అన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (టీజీఎఫ్ఏడీసీఏ)పై ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్‌లో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడుతుండడంపై సీఎం ఆందోళన వ్యక్తంచేశారు.
ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడి దిగుమతి చేసుకోవడానికి విదేశాలు నిరాకరిస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. మార్కెట్ లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు అమ్ముతున్నారని, అధిక ధరలకు ప్రజలు వాటిని కొంటున్నా అవి సేంద్రియ ఉత్పత్తులే అని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవన్నారు. ఈ నేపథ్యంలో కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.
ఆయా అధ్యయనాల ఆధారంగా ఒక నివేదిక తయారు చేయాలన్నారు. దానిపై బిల్లు రూపొందించి శాసనసభలో చర్చ చేపడతామని సీఎం తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం తెలిపారు. కల్తీలకు సంబంధించి సమాచార సేకరణకు విజిల్ బ్లోయర్లను నియమించాలని, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. కల్తీల నిరోధానికి సంబంధించి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఇక్కడ నిబంధనలు అమలు చేసి వాటి అమలులో వచ్చే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు. సమావేశంలో సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సీఎం సలహాదారు, ఎక్స్ ఆఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి, ఎన్.శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.