July 21, 2026

ప్రధాని మోదీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక ధర్నా

ప్రధాని మోదీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక ధర్నా
Reading Time: 2 minutes

ప్రధాని మోదీ ఇంటి ముందు రాహుల్, ప్రియాంక ధర్నా

Caption of Image.

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కాక్రోచ్ పార్టీ నిరసనల క్రమంలో నిరసనకారులపై లాఠీ ఛార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని నిరసిస్తూ.. ప్రధాని మోదీ ఇంటి ముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ధర్నాకు దిగారు. ప్రధాని మోదీ ఇంటి ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. ఈ నిరసనల్లో కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్.. ఇతర కాంగ్రెస్ ప్రముఖులు నిరసన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్​‘యాంటీ యూత్’ పీఎం అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.

పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ వేలాదిమంది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు, విద్యార్థులు సోమవారం పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించారు. నిరసనకారులు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్​ గ్యాస్​ ప్రయోగించి, లాఠీలతో విరుచుకుపడ్డారు.

విద్యాశాఖ మంత్రిగా ఫెయిలైన ధర్మేంద్ర ప్రధాన్​తో కనీసం రాజీనామా చేయించలేని వీక్ ప్రధాని మోదీ అని రాహుల్​ ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీకై, 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారినా ఒక్క దోషికి శిక్ష పడలేదని మండిపడ్డారు.

చదువు, భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగితే లాఠీదెబ్బలు, అరెస్టులు బహుమతిగా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. పేపర్లు లీక్ నేరస్తులు స్వేచ్ఛగా తిరుగుతుంటే, న్యాయం కోసం గొంతెత్తిన విద్యార్థులను చితక్కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని హితవు పలికారు. మన విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని, విద్యాసంస్థలన్నీ ఒకే ఒక్క సంస్థ చేతుల్లో నడుస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.

దీనిపైనే దేశ యువత తిరగబడుతోందని, వారి డిమాండ్లను ప్రధాని వెంటనే అంగీకరించి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మోదీ కేవలం ‘అసత్యం, హింస’ అనే భారత్‌‌ వ్యతిరేక సూత్రాలను నమ్ముతూ యువతను అవమానిస్తున్నారని విమర్శించారు.

  • ప్రధాని మోదీకి షాక్.. దేశ రాజధాని ఢిల్లీలో ఊహించని పరిణామం 
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు కాంగ్రెస్ పట్టు
  • ప్రధాని నివాసం ఎదుట రాహుల్, ప్రియాంక, ఖర్గే ధర్నా
  • విద్యాశాఖ మంత్రిని వెంటనే తొలగించాలని డిమాండ్
  • 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో ప్రధాని ఇంటిదగ్గర ఉద్రిక్తత
©️ VIL Media Pvt Ltd.