Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్‌కు హరీష్ సవాల్.!

సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ వద్ద ఉద్రిక్తత, ఆవేశాల మధ్య రైతులు చేపట్టిన పాదయాత్రలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. రంగనాయక సాగర్‌ను నీటితో నింపాలన్న ఒకే ఒక్క ఆకాంక్షతో చిన్నకోడూరు రైతులు స్వచ్ఛందంగా ఈ పాదయాత్ర చేపట్టారని, ఇది బీఆర్ఎస్ పెట్టిన యాత్ర కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కృత్రిమ కరువు. రేవంత్ రెడ్డి పగ, ప్రతికార రాజకీయాలతో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లను పంపింగ్ చేయడం లేదు. కేసీఆర్‌ను తిడితే నీళ్లు రావు, గోదావరిని ఎత్తిపోస్తేనే వస్తాయి” అని హరీష్ రావు హితవు పలికారు.
నా రక్తం ఇస్తా.. రైతుల పొలాలకు నీళ్లివ్వు
పంటలు ఎండిపోతుంటే ఎలా కాపాడుతారని అడిగితే.. హరీష్ రావు, కేటీఆర్‌లను కోసి వారి రక్తాన్ని పంటలపై చల్లుతా అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాగేనా మాట్లాడేది అని ప్రశ్నించారు. “మా రక్తం తాగితే నీ దాహం తీరుతుంది అంటే, రక్తం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నన్ను కోస్తావా కోయ్.. నేను వస్తా! కానీ దయచేసి కాళేశ్వరంలో మోటర్లు ఆన్ చేసి రైతులను కాపాడు. నాకు నా రక్తం కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యం” అని హరీష్ రావు ఉద్వేగభరితంగా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నీళ్లు విడిచిపెట్టకపోవడంతో కింద ఏపీలో చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా ఆ నీటిని ఒడిసిపట్టుకుంటున్నారని, ఇప్పటికే 70 టీఎంసీల నీటిని రేవంత్ కాళేశ్వరం నుంచి కిందికి వదిలేశారని ఆరోపించారు. రంగానాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ నింపకపోతే ఆయా దేవుళ్లే రేవంత్ సంగతి చూస్తారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి ఒక హిట్లర్ లా మారారు
రుణమాఫీపై కనపడ్డ దేవుళ్లందరిపై ఒట్లు వేసి రేవంత్ రెడ్డి మాట తప్పాడని, పాలకుడే పాపం చేయడం వల్లే రాష్ట్రానికి ఈ దరిద్రం, కరువు వచ్చాయని హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఉన్న పదేళ్లలో రాష్ట్రంలో కరువు అనే మాటే లేదన్నారు. “అసెంబ్లీలో తరుగు తీస్తే తోలు తీస్తా అన్న రేవంత్, ఇవాళ తోలుబొమ్మలా మారారు. రైతులకు కనీసం 10 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు. కాళేశ్వరం నుంచి నీళ్లు పంపింగ్ చేయాలని సూచిస్తున్న రిటైర్డ్ ఇంజనీర్లను జైల్లో వేస్తా, బెల్టుతో కొడతా అంటూ రేవంత్ బెదిరిస్తున్నారు. రేవంత్‌కు, హిట్లర్‌కు అస్సలు తేడా లేదు” అని విమర్శించారు. 16 వేల క్యూసెక్కుల వరద వస్తే నీళ్లు ఎలా పంపింగ్ చేయాలని అడుగుతున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. గతంలో లక్ష క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు ఏం చేశారని నిలదీశారు. కళ్లముందు నీరు వృథాగా పోతుంటే పంపింగ్ చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోతే ఎన్టీపీసీ, సింగరేణి థర్మల్ ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు హైదరాబాద్‌కు తాగునీటి కష్టాలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.
విచారణలన్నీ కేసీఆర్ పైనేనా? ప్రాజెక్టులు కూలిపోతుంటే పట్టదా?
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు ప్రాజెక్టులు ప్రమాదంలో పడినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు కొట్టుకుపోయిందని, ఎస్ఎల్బీసీ (SLBC) ప్రాజెక్టు కుప్పకూలి అందులోనే ఎనిమిది మంది చనిపోయారని గుర్తుచేశారు. అలాగే వట్టెం పంప్ హౌస్ మునిగిపోయిందని, సుంకిశాల ప్రాజెక్టు కూలిపోయిందని.. వీటిపై విచారణ జరిపించడానికి ఎన్‌డీఎస్ఏ (NDSA) ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే కుళ్లుతోనే, దానిపై మాత్రమే విచారణలు, కేసులు పెడుతూ కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.
సొంత లాభం కోసం పాస్ పోర్ట్ బ్రోకర్ లాంటి వాళ్లను సీఎంను చేసినా తెలంగాణ ప్రజలకు అన్యాయమే జరిగిందని, చెప్పులు లేకుండా తిరిగిన వాళ్లకు ఇవాళ బెంజ్ కార్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్ వైఫల్యాలను గమనిస్తున్నారని, త్వరలోనే స్కామ్‌ల కాంగ్రెస్ ప్రభుత్వం పోయి, స్కీమ్‌ల బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారన్నారు. రేవంత్ రెడ్డి తనను తిట్టినంత మాత్రాన ప్రజలు క్షమించరని, రాబోయే రోజుల్లో గజ్వేల్‌లోనే రేవంత్‌ను రాజకీయంగా సమాధి చేసే బాధ్యతను యువత తీసుకుంటుందని హరీష్ రావు హెచ్చరించారు.