July 19, 2026

Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్

Hyderabad: రైతుల దీక్షా శిబిరం తొలగించిన హైడ్రా.. బహదూర్‌గూడాలో హైటెన్షన్
Reading Time: < 1 minute
Bahadurguda Bullet Train Land Acquisition Farmers Protest Hydraa Fencing

Hyderabad: శంషాబాద్‌ పరిధిలోని బహదూర్‌గూడా గ్రామం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు నిమిత్తం ప్రభుత్వం కేటాయించిన 650 ఎకరాల భూమి చుట్టూ అధికారులు భారీ బందోబస్తు మధ్య ఫెన్సింగ్ వేసే పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఈ భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు గత కొన్ని రోజులుగా నిర్మిచుకున్న దీక్షా శిబిరాన్ని ‘హైడ్రా’ (HYDRAA) సిబ్బంది అర్ధరాత్రి ఆకస్మికంగా తొలగించడంతో వివాదం మరింత ముదిరింది. రైతుల టెంట్లను తొలగించిన హైడ్రా బలగాలు, సదరు దీక్షా శిబిరం ఉన్న ప్రాంతంలోనూ ఫెన్సింగ్ వేసి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ప్రస్తుతం బహదూర్‌గూడా పరిసర ప్రాంతాలన్నీ పోలీసులు, భద్రతా బలగాల పూర్తి ఆధీనంలోకి వెళ్ళిపోయాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బయటి వ్యక్తులు లేదా రాజకీయ నేతలు ఎవరూ లోపలికి రాకుండా చుట్టూ భారీగా పోలీసు పహారా ఏర్పాటు చేశారు.

ఇక, నిన్ననే రాష్ట్ర క్యాబినెట్ బుల్లెట్ ట్రైన్ అలైన్‌మెంట్ మార్పునకు ఆమోదం తెలిపిన తరుణంలో ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులు తమ నిరసనను ఉధృతం చేశారు. తమ విలువైన భూములను ప్రాజెక్టుకు అప్పగించాల్సి రావడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ విలువకు సమానంగా తగిన పరిహారాన్ని తక్షణమే చెల్లించాలని, లేదా తాము కోల్పోతున్న భూమికి బదులుగా సమానమైన వేరే ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. న్యాయమైన పరిహారం దక్కే వరకు తమ పోరాటం ఆపేది లేదని రైతులు స్పష్టం చేస్తుండగా, అధికారులు మాత్రం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ముందుకు కదులుతున్నారు.