రేపటి నుంచి (జులై 20) పార్లమెంటు సమావేశాలు.. సీజేపీ చలో పార్లమెంట్.. జంతర్ మంతర్ దగ్గర హై టెన్షన్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళన చేస్తున్న ఢిల్లీ జంతర్ మంతర్ దీక్షా స్థలి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 20 రోజులకు పైగా నిరధిక నిరాహార దీక్ష చేపట్టిన హక్కుల కార్యకర్త సోనం వాంగ్ చుక్ ను తరలించడంతో.. సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ఆమరణ దీక్షకు కూర్చున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రేపు (సోమవారం జులై 20) నుంచిపార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు చలో పార్లమెంటుకు పిలుపునిచ్చింది సీజేపీ. పార్లమెంటు సమావేశాలు ఉన్న తరుణంలో సీజేపీ చాలో పార్లమెంటు కార్యక్రమాన్ని అడ్డుకునే క్రమంలోనే పోలీసులు మోహరించినట్లు సీజేపీ నేతలు భావిస్తున్నారు.
జంతర్ మంతర్ దగ్గర సాయంత్రం 7 గంటల తర్వాత దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. వెంటనే ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సోనమ్ వాంగ్ చుక్ ను తరలించే ముందు కూడా ఇలాగే భారీ ఎత్తున పోలీసులు దీక్షా స్థలిని చుట్టుముట్టారు. ప్రస్తుతం కూడా సీజేపీ ఫౌండర్ దీప్కే ను అక్కడి నుంచి తరలించనున్నట్లు భావిస్తున్నారు. దీప్కే తో పాటు వివిధ విద్యార్థి సంఘాల నేతలను కూడా అక్కడి నుంచి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పార్లమెంటు సమావేశాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. సీజేపీ చలో పార్లమెంటు నినాదంతో.. భారీ ఎత్తున సీజేపీ మద్ధతు దారులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. దీంతో అడుగడుగున పోలీసులతో ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది.