July 21, 2026

FIFA World Cup Prize Money: ఛాంపియన్‌ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?

FIFA World Cup Prize Money: ఛాంపియన్‌ స్పెయిన్కు ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ లభించిందంటే.?
Reading Time: < 1 minute
Fifa World Cup 2026 Prize Money How Much Did Spain And Argentina Earn After The Final

ఫిఫా వరల్డ్ కప్ 2026లో స్పెయిన్ చరిత్ర సృష్టించింది. న్యూజెర్సీలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాను 1-0తో ఓడించి రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో స్పెయిన్ ప్రపంచ కప్ ట్రోఫీని కైవసం చేసుకోవడమే కాకుండా రికార్డు స్థాయి ప్రైజ్ మనీని కూడా సొంతం చేసుకుంది.

ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించింది. మొత్తం 120 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో స్పెయిన్ అర్జెంటీనా గోల్‌ పోస్ట్ పై ఏకంగా 20 షాట్లు నమోదు చేయగా.. అందులో 11 లక్ష్యాన్ని తాకాయి. మరోవైపు అర్జెంటీనా చివరి నిమిషాల్లో మాత్రమే మూడు ప్రయత్నాలు చేసినా ఒక్కటీ గోల్‌గా మారలేదు. అదనపు సమయంలో ఫెరాన్ టొరెస్ చేసిన ఏకైక గోల్ స్పెయిన్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించి ప్రపంచ కప్ ను అందిచింది. ఫెరాన్ టొరెస్ చేసిన ఈ అద్భుత గోల్ కు ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు’ లభించింది.

ఈసారి ఫిఫా వరల్డ్ కప్ కోసం మొత్తం 655 మిలియన్ డాలర్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించింది. ఇందులో విజేతగా నిలిచిన స్పెయిన్‌కు 50 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.481 కోట్లు) ప్రైజ్ మనీగా లభించింది. ప్రపంచ కప్ చరిత్రలో విజేత జట్టుకు అందించిన అత్యధిక నగదు బహుమతి ఇదే. ఫైనల్‌లో ఓటమిపాలైన అర్జెంటీనా కూడా ఖాళీ చేతులతో వెళ్లలేదు. రన్నరప్‌గా నిలిచిన ఆ జట్టుకు 33 మిలియన్ డాలర్లు (రూ.318 కోట్లు) ప్రైజ్ మనీ అందుకుంది.

నగదు బహుమతితో పాటు స్పెయిన్ ఆటగాళ్లకు ప్రత్యేక గౌరవాలు కూడా లభించాయి. ప్రపంచ కప్ ట్రోఫీ, బంగారు పతకాలతో పాటు తొలిసారిగా ఫిఫా విజేత జట్టు సభ్యుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన గోల్డ్ చాంపియన్ రింగ్ ను కూడా అందించింది. బంగారంతో తయారు చేసిన ఈ రింగ్‌పై చిన్న వజ్రాలను పొదిగారు. ఒకవైపు ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ ఆకృతి, మరోవైపు స్పెయిన్ పేరు చెక్కి ఉండేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్పెయిన్ జట్టులోని మొత్తం 30 మంది ఆటగాళ్లకు ఈ ప్రత్యేక రింగ్‌లు అందుకున్నారు. ప్రపంచ కప్ విజయం, రికార్డు స్థాయి ప్రైజ్ మనీ, ప్రత్యేక గోల్డ్ రింగ్స్‌తో స్పెయిన్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2026ను మరింత చిరస్మరణీయంగా మార్చుకుంది.