July 22, 2026

బర్గర్ తింటూ వీడియో.. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి విజేత దహియాపై వేటు

బర్గర్ తింటూ వీడియో.. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి విజేత దహియాపై వేటు
Reading Time: 2 minutes

బర్గర్ తింటూ వీడియో.. కాక్రోచ్ జనతా పార్టీ నుంచి విజేత దహియాపై వేటు

Caption of Image.

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోన్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తమ అధికార ప్రతినిధి విజేత దహియాపై సీజేపీ బహిష్కరణ వేటు వేసింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ప్రవర్తన తీవ్ర వివాదాస్పదం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీజేపీ నాయకత్వం స్పష్టం చేసింది. దహియాను తక్షణమే అన్ని అధికారిక బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది. సీజేపీ ఉద్యమం తీవ్రరూపం దాల్చిన వేళ పార్టీలో లుకలుకలు బయటపడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

అసలేం జరిగిందంటే..?

నీట్ 2026 పేపర్ లీక్, విద్యా వ్యవస్థలోని అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ లో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే జులై 20న పార్లమెంట్ మార్చ్ (చలో సంసద్) కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది. సీజేపీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసి హింసాత్మకంగా మారింది. కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, మద్దతు దారులపై పోలీసులు దమనకాండ కొనసాగించారు. 

విచక్షణరహితంగా లాఠీచార్జ్ చేయడంతో నిరసనకారులపై టియర్ గ్యా్స్ ప్రయోగించారు. పోలీసుల దమనకాండంలో పదుల సంఖ్యలో సీజేపీ ప్రొటెస్టర్స్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో సీజేపీ అధికార ప్రతినిధి విజేత దహియాకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. ఒకవైపు పోలీసుల నిర్భంధాన్ని ఛేధించుకుంటూ సీజేపీ కార్యకర్తలు చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని ఉధృతంగా కొనసాగిస్తుంటే.. మరోవైపు అదే నిరసన స్థలికి సమీపంలో దహియా బర్గర్ తింటూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఈ ఘటనపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. పోలీసుల చేతిలో కార్యకర్తలు దెబ్బలు తిని రక్తమోడుతున్న వెనక్కి తగ్గకుండా పోరాడుతుంటే.. పార్టీలో కీలక పదవిలో ఉన్న దహియా మాత్రం కనీసం నిరసనలో కూడా పాల్గొనకుండా బర్గర్ తింటూ కాలక్షేపం చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలతో యువతలో కాక్రోచ్ జనతా పార్టీపై ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుందని కొందరు కామెంట్స్ చేశారు. ఈ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ టాప్ లీడర్ షిప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. విజేత దహియాను వివరణ కోరింది.

 అయితే, తాను ఎన్నికైన ప్రతినిధిని కానని.. కేవలం స్వచ్ఛందంగానే ఉద్యమంలో పాల్గొంటున్నానని విజేత దహియా పేర్కొన్నాడు. తానెవరికీ బాధ్యత వహించాల్సిన అవసరం లేదని సమాధానమిచ్చాడు. విజేత దహియా వివరణపై తీవ్రంగా స్పందించిన సీజేపీ నాయకత్వం అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దహియా ప్రవర్తన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని.. అది పార్టీ విలువలకు, ఉద్యమ సిద్ధాంతాలకు విరుద్ధమని పేర్కొంది. 

 

©️ VIL Media Pvt Ltd.