July 21, 2026

Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!

Harry Brook: వరల్డ్ నంబర్‌వన్ భారత్‌పై రెండు సిరీస్‌లు గెలిచా.. నేను ఫుల్ హ్యాపీ.. మా విజయ రహస్యం అదే!
Reading Time: 2 minutes
Harry Brook Delighted After England Beat World No 1 India To Win Odi And T20i Series

Harry Brook Reveals England’s Winning Formula vs India: భారత్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను ఇంగ్లండ్ 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకుంది. ఈ రెండు సిరీస్‌లు హ్యారీ బ్రూక్ సారథ్యంలోనే ఇంగ్లండ్ గెలిచింది. మూడో వన్డే అనంతరం ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ హ్యారీ బ్రూక్ తన ఆనందం వ్యక్తం చేశాడు. ప్రపంచ నంబర్‌వన్ వన్డే జట్టైన భారత్‌పై రెండు సిరీస్‌లు గెలవడం తనకు ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నాడు. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ఆటగాళ్ల మధ్య అద్భుతమైన కమ్యూనికేషన్, సమష్టి ప్రదర్శన, కచ్చితమైన ప్రణాళికలే విజయానికి ప్రధాన కారణాలని బ్రూక్ వెల్లడించాడు.

లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 27 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించి సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన బ్రూక్.. ‘ప్రపంచ నంబర్‌వన్ జట్టుపై సిరీస్ గెలవడం చాలా గర్వంగా ఉంది. ఆటగాళ్లంతా చివరి వరకు పోరాడారు. టీ20 సిరీస్‌లో ఎలా కమ్యూనికేట్ చేసుకున్నామో, ఈ సిరీస్‌లో కూడా అదే విధానాన్ని కొనసాగించాం. అందుకే ఈ విజయాన్ని సాధించగలిగాం. మా బ్యాటింగ్‌కు ఒక స్పష్టమైన టెంప్లేట్ ఉండాలని ముందే నిర్ణయించుకున్నాం. బెన్ డకెట్, జాకబ్ బెతెల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన తీరు అసాధారణం. 20 నుంచి 30 ఓవర్ల వరకు ఎలాంటి అనవసర రిస్క్ తీసుకోకుండా భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత జో రూట్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చివర్లో జోస్ బట్లర్ మెరుపు బ్యాటింగ్‌తో అద్భుతంగా ముగించాడు. ఇది మా జట్టు నుంచి వచ్చిన సంపూర్ణ బ్యాటింగ్ ప్రదర్శన’ అని వివరించాడు.

మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచిన జాకబ్ బెతెల్ బౌలింగ్‌పై కూడా బ్రూక్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో జరిగిన చర్చే ఆ నిర్ణయానికి కారణమని తెలిపాడు. ‘ఒక ఓవర్ తర్వాత నేను బయటకు వెళ్లి కోచ్ బాజ్ (బ్రెండన్ మెకల్లమ్)తో మాట్లాడాను. బెతెల్‌కు అవకాశం ఇచ్చి వరుసగా ఏడు లేదా ఎనిమిది ఓవర్లు బౌలింగ్ చేయించు అని సూచించారు. ఆ నిర్ణయం మ్యాచ్‌లో చాలా కీలకంగా మారింది. కొంత ఒత్తిడి ఎదురైనా అందరూ ప్రణాళికకు కట్టుబడి పోరాడారు. చివరకు అదే మాకు విజయాన్ని అందించింది’ అని బ్రూక్ చెప్పాడు.

లార్డ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు ఆరంభం నుంచి చివరి వరకు ఆధిపత్యం చెలాయించారు. బెన్ డకెట్ సెంచరీ, జాకబ్ బెతెల్ కీలక ఇన్నింగ్స్, జో రూట్ అనుభవం, జోస్ బట్లర్ మెరుపు ఫినిషింగ్‌తో ఇంగ్లండ్ 387/3 భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బౌలర్లు సమష్టిగా రాణించి భారత్‌ను 360/7కే పరిమితం చేశారు. ఈ విజయంతో టీ20 సిరీస్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించిన ఇంగ్లండ్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో గెలిచి స్వదేశంలో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు సిరీస్‌లు గెలవడంతో హ్యారీ బ్రూక్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.