రైతుల ధాన్యం డబ్బులు సొంత ఖాతాలోకి.. పెద్ద రావులపల్లి సర్పంచ్కు కలెక్టర్ షోకాజ్ నోటీస్

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి సర్పంచ్ మోటె బాలకృష్ణకు కలెక్టర్ అనురాగ్ జయంతి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పెద్ద రావులపల్లికి చెందిన 21 మంది రైతులు 661 బస్తాల వడ్లను సెంటర్లో అమ్మారు. ఈ వడ్లకు సంబంధించిన అమౌంట్ రూ. 9 లక్షలు సర్పంచ్ బాలకృష్ణ అకౌంట్లో జమ చేశారు. సంబంధిత రైతులకు డబ్బు ఇవ్వడంలో సర్పంచ్ ఆలస్యం చేశారు.
దీంతో రైతులు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. అనంతరం డబ్బులు మొత్తం రైతులకు చెల్లించారు. అయితే ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జూలూరు పీఏసీఎస్ సెక్రటరీ ఆర్ నర్సింహపై ఈ నెల 8న సస్పెన్షన్ వేటు వేశారు. అగ్రికల్చర్ ఆఫీసర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సర్పంచ్ బాలకృష్ణ తన అకౌంట్లో డబ్బు వేయించుకోవడంపై ఫిర్యాదు రావడంతో జిల్లా పంచాయతీ ఆఫీసర్ శ్రీనివాసరెడ్డి విచారణ నిర్వహించి, కలెక్టర్కు నివేదిక అందించారు. దీంతో సర్పంచ్కు కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.