July 21, 2026

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!
Reading Time: 2 minutes

70 ఏళ్ల తర్వాత.. గోదావరి నీటి ప్రవాహం కనిష్ఠానికి పడిపోయింది..!

Caption of Image.

అమరావతి: సూపర్ ఎల్ నినో కారణంగా గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా జూలైలో గోదావరి నది నీటి ప్రవాహం 15 వేల నుంచి 20 వేలకు క్యూసెక్కులకు పడిపోయిందని ఆంధ్రప్రదేశ్ సాగునీటి శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో జూలైలో నీటి ప్రవాహం సెకనుకు 1 లక్ష నుంచి 2 లక్షల క్యూసెక్కుల మధ్య ఉంటుందని చెప్పారు. సూపర్ ఎల్ నినో కారణంగా రాష్ట్రానికి నీటి లభ్యత తగ్గిందన్నారు. సాధారణంగా ఏటా 3 వేల టీఎంసీల (వెయ్యి మిలియన్ క్యూబిక్ అడుగుల) గోదావరి నదీ జలం సముద్రంలోకి ఇంకిపోతుందని పేర్కొన్నారు. 

నది నీటి ప్రవాహం తగ్గడం వల్ల 10.17 లక్షల ఎకరాల వరకు సాగునీరు అందిస్తున్న గోదావరి డెల్టా ప్రాంత సాగునీటి అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం సిలేరు నది నుంచి నీటిని తరలిస్తోందని తెలిపారు. సిలేరు నీటిని సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో రబీ పంట కోసం మాత్రమే వాడుకుంటారు. కానీ ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు సాగు నీరు అందించడం కోసం ప్రభుత్వం సిలేరు నీటిని తరలిస్తోందని చెప్పారు. సూపర్ ఎల్ నినో పరిస్థితులు ఉన్నప్పటికీ గోదావరి డెల్టాకు సాగునీటి కోసం 14 వేల 800 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

 అయితే, గోదావరి డెల్టాలోని సుదూర ప్రాంతాలు సాగు నీటి కోసం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాయని అంగీకరించారు. కృష్ణా డెల్టాలో కూడా నీటిపారుదల మౌలిక సదుపాయాలను 70 శాతం ప్రాంతానికి కాలువల వ్యవస్థ ద్వారా మరియు మిగిలిన 30 శాతం వర్షపు నీటి ద్వారా నీటిని అందించే విధంగా రూపొందించారని ఆయన అన్నారు. వర్షపు నీటి కొరత కారణంగా కృష్ణా, గోదావరి రెండు డెల్టాలు ఒత్తిడికి గురవుతున్నాయని.. ప్రస్తుతం పూర్తిగా కాలువ నీటిపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. 

సుదూర ప్రాంతాలకు వీలైనంత వరకు నీటి సరఫరా సమస్యను పరిష్కరించడానికి నిర్వహణ పనులు చేపడుతున్నామని.. అడ్డంకులను తొలగిస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి డెల్టాలోని ఎత్తైన ప్రాంతాలకు నీరు అందకపోవచ్చని.. అయితే మిగిలిన 90 శాతం ప్రాంతానికి నీరు అందుతుందని స్పష్టం చేశారు. ఎత్తైన ప్రాంతాల్లోని 10 శాతం భూమి మినహా మిగిలిన 90 శాతం పొలాలకు ఖరీఫ్ సీజన్‌లో సాగు కోసం నీరు అందిస్తామని చెప్పారు. ఇందుకోసం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.