July 21, 2026

Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?

Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
Reading Time: 2 minutes
Mohammad Kaif R Ashwin Question Kuldeep Yadavs Omission After England Odi Series

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డేలో కూడా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కారణంగా కుల్దీప్‌కు ప్లేయింగ్ 11లో ఆడలేదు. గాయం కారణంగా సుందర్ మూడో మ్యాచ్‌లో ఆడకున్నా.. కుల్దీప్‌కు అవకాశం రాలేదు. లార్డ్స్ మైదానంలో యువకులను ఆడించిన టీమిండియా మూల్యం చెల్లించుకుంది. కుల్దీప్‌కు అవకాశం రాకపోవడంపై మాజీ భారత క్రికెటర్ మహ్మద్ కైఫ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన కైఫ్.. వరుసగా అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెడుతుంటే కుల్దీప్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని సూచిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి వంటి ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు కల్పించకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని కైఫ్ పేర్కొన్నాడు. ‘కుల్దీప్ యాదవ్ ఇప్పుడు తన బ్యాగులు సర్దుకుని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాలా అనే ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బుమ్రా లేడు, వాషింగ్టన్ లేడు, వరుణ్ కూడా లేడు. అయినా కుల్దీప్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. లార్డ్స్‌లో భారత బౌలింగ్ ఒకే తరహాలో కనిపించింది. ఎడమచేతి రిస్ట్ స్పిన్నర్ ఉంటే జట్టుకు ఎంతో ఉపయోగపడేవాడు. 118 వన్డేల్లో 194 వికెట్లు తీసిన రికార్డులు కూడా ఇప్పుడు విలువలేనివిగా కనిపిస్తున్నాయి’ అని ‘ఎక్స్’లో కైఫ్ రాసుకొచ్చాడు.

కుల్దీప్‌ను వరుసగా పక్కన పెట్టడంపై భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఫైర్ అయ్యాడు. ‘కుల్దీప్‌ను ఆడించకపోవడానికి బ్యాటింగ్ డెప్త్ అవసరమనే కారణం చెప్పారు. కానీ ఇప్పుడు అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. బుమ్రా కూడా లేని సమయంలో కుల్దీప్‌కు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. ఇలాంటి నిర్ణయాలు బౌలర్ ఆత్మవిశ్వాసం, లయపై ప్రతికూల ప్రభావం చూపుతాయి’ అని యాష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో కుల్దీప్‌కు టీ20 సిరీస్‌లో విశ్రాంతిని ఇచ్చింది. వన్డే సిరీస్‌లో ఉన్నా కూడా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. మూడు వన్డేల్లోనూ అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.

జట్టు యాజమాన్యం బ్యాటింగ్ డెప్త్ కోసం అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్‌లకు ప్రాధాన్యం ఇస్తుండగా.. కుల్దీప్ ప్రధాన బలం అయిన స్పిన్ బౌలింగ్‌కు తగిన గుర్తింపు దక్కడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 118 వన్డేల్లో 194 వికెట్లు సాధించిన కుల్దీప్.. భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించిన మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు పొందాడు. అయినప్పటికీ వరుసగా అవకాశాలు దక్కకపోవడంతో అతని భవిష్యత్తుపై ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. మహ్మద్ కైఫ్, రవిచంద్రన్ అశ్విన్ చేసిన వ్యాఖ్యలు జట్టు ఎంపిక విధానంపై మరోసారి చర్చకు దారితీశాయి.