రక్తానికి రక్తం..అమెరికాకు ఇరాన్ హెచ్చరిక

- దాడులు కొనసాగిస్తే భారీ స్థాయిలో జవాబు చెప్తం
- ఏ సరిహద్దూ సేఫ్ కాదన్న టెహ్రాన్
- ఏడో రోజూ కొనసాగిన దాడులు
టెహ్రాన్/ వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అమెరికా బలగాలు ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీయడం కొనసాగిస్తుంటే, ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో అమెరికా మిత్రదేశాలైన కువైట్, ఖతార్, ఒమన్‌లోని సైనిక కేంద్రాలపై దాడులు చేస్తోంది. ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని బలహీన పరచడమే లక్ష్యంగా అమెరికా దళాలు వరుసగా ఏడో రాత్రి కూడా దాడులు చేశాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ ఈ దాడుల వ్యూహాన్ని సమర్థిస్తూనే, తమ సైనిక కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఇరాన్ అత్యంత దూకుడుగా స్పందిస్తోంది. తమపై దాడులు మరో రెండు మూడు రోజులు కొనసాగితే, తమ దాడుల వ్యూహాన్ని మార్చేస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ప్రతీకార దాడులకే పరిమితమయ్యామని, ఇకపై పూర్తిస్థాయిలో దాడులకు దిగుతామని టెహ్రాన్ హెచ్చరించింది. అదే జరిగితే ఏ సరిహద్దు కూడా సురక్షితంగా ఉండబోదని స్పష్టం చేసింది. ఈమేరకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారు మేజర్ జనరల్ మొహసెన్ రెజాయ్ అమెరికాను హెచ్చరించారు. మరోవైపు, టెహ్రాన్‌లోని ‘ఎంగేలాబ్ స్క్వేర్’ వంటి ప్రముఖ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ హోర్డింగ్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులను శవపేటికల్లో ఉన్నట్లుగా గ్రాఫిక్ చిత్రాలతో రూపొందించారు. దీనిపై ‘‘రక్తానికి రక్తం” అనే నినాదంతో పాటు, అమెరికాకు వ్యతిరేకంగా తీవ్రమైన హెచ్చరికలు రాశారు. ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పదేపదే చెబుతున్న నేపథ్యంలో ఈ హోర్డింగ్స్ మరింత వేడిని పుట్టిస్తున్నాయి. కేవలం ట్రంప్‌ను మాత్రమే కాకుండా, గతంలో అమెరికా తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా లేదా యుద్ధంలో మరణించిన ఇరాన్ పౌరుల జ్ఞాపకార్థం కూడా అనేక రకాల పోస్టర్లను టెహ్రాన్ వీధుల్లో ఏర్పాటు చేశారు. గతంలో ‘మినాబ్’ పాఠశాల ఘటనలో చనిపోయిన పిల్లల పేరిట కూడా ఇరాన్ ప్రచార చిత్రాలను ప్రదర్శించింది.
మౌలిక సదుపాయాలపై దాడులా..?
యుద్ధం పౌర మౌలిక సదుపాయాలను తాకడంపై ప్రపంచ దేశాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తమ భూభాగంలోని విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడులకు దిగుతోందని ఇరాన్ తీవ్రంగా మండిపడుతోంది. అమెరికా మాత్రం టెహ్రాన్ సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్పందించారు. పౌర లక్ష్యాలపై దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని హెచ్చరించారు. మరోవైపు, అమెరికా సైన్యం జరుపుతున్న దాడులతో ఇరాన్ విద్యుత్ గ్రిడ్ తీవ్ర ఒత్తిడికి లోనవుతోంది, దీనివల్ల ప్రజలు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ప్రపంచ సరఫరా గొలుసుపై ప్రభావం
ఈ యుద్ధ ప్రభావం కేవలం ఇరు దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ దేశాలకు పాకింది. కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి వద్ద భద్రతాపరమైన ఆందోళనలు, వాణిజ్య నౌకలపై దాడులు జరగడం వంటి అంశాలు ప్రపంచ చమురు సరఫరా వ్యవస్థను అస్థిరపరుస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఆందోళనల మధ్య, యుద్ధాన్ని ఆపి చర్చలు జరపాలన్న అంతర్జాతీయ విజ్ఞప్తులను అమెరికా కానీ, ఇరాన్ కానీ పట్టించుకోవడం లేదు.