ఆపరేషన్ సింధూర్ బిగ్ సక్సెస్.. ఓటమి కప్పిపుచ్చుకునేందుకు పాక్ సైన్యం కట్టుకథలు: పాక్ మాజీ PM సోదరి

ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి నొరీన్ నియాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ భారీ విజయం సాధించిందని.. యుద్ధంలో ఎదురైన ఘోర ఓటమిని దాచేందుకు పాకిస్తాన్ సైన్యం, ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. పాక్ సైన్యం తన ప్రతిష్టను పెంచుకోవడానికి సోషల్ మీడియా వేదికగా అబద్ధపు కథనాలను ప్రచారం చేస్తోందని పేర్కొన్నారు.
సాంప్రదాయ యుద్ధరంగంలో భారత సాయుధ దళాలను ఓడించే సామర్థ్యం పాకిస్తాన్ ఆర్మీకి లేనేలేదని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పహల్గామా ఉగ్రదాడికి ప్రతీకారంగా మరింత బలంగా ప్రతిస్పందించే అవకాశం ఉన్నప్పటికీ భారత్ సంయమనం పాటించిందని పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని మధ్యవర్తిత్వం వహించడం వల్లే పాక్ సైన్యానికి పరువు దక్కిందని.. లేదంటే మరింత నష్టం వాటిల్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నొరీన్ నియాజీ వ్యాఖ్యలు పాక్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. పాక్ నేతలు ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇవి దేశ వ్యతిరేక వ్యాఖ్యలని.. ఇమ్రాన్ ఖాన్ కుటుంబం దేశ విజయాలను తట్టుకోలేకపోతోందని విమర్శించారు. మరోవైపు.. పాక్ ప్రభుత్వం, ఆర్మీని కించపర్చడంతో పాటు సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యా్ప్తి చేస్తున్నారనే ఆరోపణలపై పాకిస్తాన్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నోరీన్ నియాజీకి సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా విచారణకు రావాలని ఆదేశించింది.
ఆపరేషన్ సింధూర్
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్ మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.