రెండు ఉల్లిపాయలతో 10 నిమిషాల్లో రుచిగా ఉల్లికారం ఇలా చేయండి.. వేడి అన్నంలో తింటే సూపర్ టేస్ట్
రెండు ఉల్లిపాయలతో రుచికరమైన ఉల్లికారం చట్నీ (Onion Chutney) – అన్నం, చపాతీ, ఇడ్లీ, దోసెలకు సూపర్‌గా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు.. పెద్ద ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి), ఎండుమిర్చి – 8 నుంచి 10, వెల్లుల్లి రెబ్బలు – 6 నుంచి 8, కొత్తిమీర- గుప్పెడు, చింతపండు – చిన్న నిమ్మకాయంత, జీలకర్ర – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, నూనె – 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు – ½ టీ స్పూన్, మినప్పప్పు – 1 టీ స్పూన్, శనగపప్పు – 1 టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – 1 రెమ్మ, ఇంగువ – చిటికెడు తీసుకోవాలి.
స్టవ్‌పై పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేయాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించి మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు తరిగిన రెండు ఉల్లిపాయలను వేసి, కొద్దిగా ఉప్పు చల్లాలి. మీడియం మంటపై వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారి మెత్తబడే వరకు 5 నుంచి 6 నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చింతపండు వేసి మరో నిమిషం పాటు కలుపుతూ వేయించాలి.
తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి అవసరమైనంత ఉప్పు కలపాలి. కొద్దిగా మాత్రమే నీరు వేయాలి లేదా నీరు లేకుండా దంచుకోవచ్చు. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా గరుకుగా గ్రైండ్ చేస్తే రుచి బాగుంటుంది.
తర్వాత చిన్న పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, ఇంగువ.. వేసి వేగిన తర్వాత ఈ తాలింపును పచ్చడిపై పోసి బాగా కలపాలి. అంతే రుచికరమైన ఉల్లికారం చట్నీ రెడీ అయినట్లే.
పచ్చడి రుచిగా కావాలంటే కొద్దిగా బెల్లం వేస్తే పులుపు, కారం బ్యాలెన్స్ అవుతాయి. ఎక్కువ కారం కావాలంటే 2–3 ఎండుమిర్చిలు అదనంగా వేయండి. చపాతీల కోసం చేస్తే ఒక స్పూన్ వేరుశెనగలు వేయించి గ్రైండ్ చేస్తే మరింత టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడి కలిపి తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఈ ఆనియన్ చట్నీని వేడి అన్నం, చపాతీ, రోటీ, ఇడ్లీ, దోసె, పూరీ, ఉప్మాతో దీనితో తిన్నా భలేగా ఉంటుంది. ఫ్రిజ్‌లో 2–3 రోజుల వరకు తాజాగా నిల్వ ఉంటుంది.




