మీరు స్మార్ట్ వాచ్ వాడితే ఇది తెలుసుకొని తీరాలి.. అర్థరాత్రి వచ్చే అలర్ట్స్తో ఎంత డేంజరంటే..

మీరు స్మార్ట్ వాచ్ వాడుతుంటే.. ఏదో ఒక రోజు మిడ్ నైట్ అలర్ట్స్ మీలో టెన్షన్ క్రియేట్ చేసిన సిచువేషన్ ఉండే ఉంటుంది కదా. ముఖ్యంగా గుండెకు సంబంధించిన హార్ట్ అలర్ట్ వస్తే ఆ టెన్షన్ తో తెలవారే వరకు నిద్ర పట్టకపోవచ్చు కదా. స్మార్ట్ వాచ్ ఇచ్చే హెల్త్ అలర్ట్స్ మంచివే అయినప్పటికీ.. అర్ధరాత్రి సడెన్ గా వచ్చే అలర్ట్స్ తెచ్చే కొత్త సమస్యలపై డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
స్మార్ట్‌వాచ్‌లు అనవసర ప్యానిక్ కలిగిస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. స్మార్ట్‌వాచ్ నుంచి మధ్యరాత్రి వచ్చే హార్ట్ రేట్ స్పైక్ లేదా ఆక్సిజన్ డ్రాప్ అలర్ట్ చాలా మందిని భయపెడుతోంది. శరీరం సాధారణంగా ఉన్నా, వాచ్ చూపించిన ఒక్క సంఖ్యకు భయపడి డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. ఇలాంటి వేరబుల్-ఇండ్యూస్డ్ హెల్త్ యాంగ్జైటీ పెరుగుతోందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
డాక్టర్ల అభిప్రాయం ప్రకారం.. చాలా మంది రోగులు లక్షణాలు లేకుండానే వాచ్‌లో హార్ట్ రేట్ 140కి పెరిగింది లేదా నిద్రలో ఆక్సిజన్ తగ్గింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అతిగా హెల్త్ మానిటరింగ్ చేయడం వల్ల స్ట్రెస్ పెరిగి, అసిడ్ రిఫ్లక్స్, IBS వంటి సమస్యలు వస్తున్నాయి. ఆందోళన వల్లే శరీరంలో నిజమైన సమస్యలు తలెత్తవచ్చు.
పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ:
స్మార్ట్‌వాచ్‌లు కేవలం అడుగులు లెక్కించడం ఒక్కటే కాకుండా చాలా పనులు చేసిపెడుతుంటాయి. గుండె స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ (SpO2), నిద్ర, ఒత్తిడి స్థాయిలు, ఫిజికల్ యాక్టివిటీస్, కొంతమందిలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ (AFib)ను కూడా గుర్తిస్తాయి.
ఈ ఫీచర్లు లక్షలాది మందిని అలర్ట్ గా ఉండటానికి, వారి నిద్ర అలవాట్లను మార్చుకోవడానికి, లాంగ్ రన్ లో ఆరోగ్య ధోరణులను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతున్నాయి.
అపోలో అడ్లక్స్ హాస్పిటల్, మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ సీనియర్ కన్సల్టెంట్ ప్రకారం.. హెల్త్ అలర్ట్స్ ఇచ్చే డివైజ్ లను పదే పదే వాడటం హానికరం అని చెబుతున్నారు.
ఆరోగ్య పర్యవేక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన డివైజ్ లు.. ప్రజల్ని మరింత భయభ్రాతులకు గురిచేస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
స్మార్ట్‌వాచ్ ఎలా వాడాలి..?
స్మార్ట్‌వాచ్ డేటాను డయాగ్నోసిస్ కు కాకుండా గైడెన్స్ కోసం మాత్రమే వాడితే ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఎప్పటికప్పుడు వచ్చే విడివిడి రీడింగ్‌లకు బదులుగా లాంగ్ టర్మ్ హెల్త్ ట్రెండ్ పై దృష్టి పెట్టడం మంచిది.
ఒకే ఒక్క అబ్నార్మల్ హెచ్చరిక చూసి కంగారు పడకండి. ఏదో తప్పు ఉందని భావించే ముందు వచ్చిన రీండింగ్ ను మరోసారి చూసుకోవాలి.ఎక్ససైజ్, స్ట్రెస్, నిద్రపోకపోవడం లేదా వంటి అంశాలు రీడింగులను ప్రభావితం చేస్తాయి. వాటి గురించి తెలుసుకోండి.
అయితే స్మార్ట్ వాచ్ అలర్ట్స్ లలో అబ్ నార్మల్ వ్యాల్యూస్ పదే పదే వస్తే.. అప్పుడు డాక్టర్ ను సంప్రదించడం మంచిది. అదే విధంగా ఛాతీ నొప్పి, స్పృహ కోల్పోవడం, తీవ్రమైన ఆయాసం లేదా నిరంతర గుండె దడ వంటి లక్షణాలకనిపించినా డాక్టర్ ను కలవడం మంచిది.