Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!

Sikkim Tunnel Collapse: సిక్కింలోని నామ్‌చి జిల్లాలో నిర్మాణంలో ఉన్న సమర్‌దుంగ్-మామరింగ్ టన్నెల్ బయట భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో సుమారు 27 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు కార్మికులు మృతి చెందినట్లు జిల్లా యంత్రాంగం అధికారికంగా ధృవీకరించింది. మృతదేహాలను సింగ్తం జిల్లా ఆసుపత్రి, గ్యాంగ్‌టాక్‌లోని STNM ఆసుపత్రి, నామ్‌చి జిల్లా ఆసుపత్రులకు తరలించారు.
ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అధికారులకు అతిపెద్ద సవాలు.. టన్నెల్ లోపల నిండిపోయిన ప్రమాదకరమైన మీథేన్ గ్యాస్ ఉండటమని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడటంతో భూమి, రాళ్ల పొరలు జరిగి ఈ గ్యాస్ బయటకు విడుదలైనట్లు భావిస్తున్నారు. గ్యాస్ ప్రభావం వల్ల సహాయక చర్యల్లో పాల్గొంటున్న పలువురు రెస్క్యూ సిబ్బందికి తల తిరగడం, మరికొందరు స్పృహ తప్పిపడిపోవడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీనికి తోడు టన్నెల్ మార్గం చాలా ఇరుకుగా ఉండటం, పొగ లేదా మబ్బు వల్ల దారి సరిగ్గా కనిపించకపోవడం కూడా రెస్క్యూ టీమ్‌కు తీవ్ర అడ్డంకిగా మారాయి. అందుకే అత్యంత జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు.
ప్రస్తుతం నామ్‌చి జిల్లా యంత్రాంగం ఎన్ హెచ్ పి సి (NHPC) అధికారులు, ఎస్‌డిఆర్‌ఎఫ్ (SDRF), ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), సిక్కిం పోలీసులు, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, ఆరోగ్య శాఖలతో కలిసి నిరంతరం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అలాగే సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (SSDMA) అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. కొండచరియలు విరిగిపడి టన్నెల్ ప్రవేశ మార్గం పూర్తిగా శిథిలాలతో మూసుకుపోవడంతో, లోపల ఉన్న కార్మికులను సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.